ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీం కోర్టు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో పిటిషన్ దాఖలు చేశారు. జమ్మూకాశ్మీర్‌లో పునర్విభజన సమయంలో, ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌తో కూడి ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని 170(3) అధికరణం ప్రకారం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26కు పరిమితి ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. 2026లో మొదటి జనగణన లెక్కల తర్వాతే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది. ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతించడం వల్ల మిగతా రాష్ట్రాల నుంచి కూడా నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్లు వచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు రాష్ట్రాలలో డీలిమిటేషన్‌కు సంబంధించిన నిబంధనలు భిన్నంగా ఉంటాయని, జమ్మూకాశ్మీర్‌పై ప్రత్యేక దృష్టిసారించారన్న వాదనను కూడా ధర్మాసనం తిరస్కరించింది.