'వైవాహిక అత్యాచారంపై మీ స్పందన ఏంటీ'.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

Supreme Court directs central government to respond on marital rape. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ

By అంజి  Published on  17 Jan 2023 4:40 AM GMT
వైవాహిక అత్యాచారంపై మీ స్పందన ఏంటీ.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై ఫిబ్రవరి 15లోపు ప్రతిస్పందన తెలియజేయాలని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే మేజర్‌ అయిన భార్యపై బలవంతంగా లైంగిక సంపర్కానికి పాల్పడిన భర్తకు రక్షణ కల్పించే ఐపీసీ సెక్షన్‌ 375లోని మినహాయింపును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ల బ్యాచ్‌పై సుప్రీంకోర్టు సోమవారం కేంద్రం నుండి ప్రతిస్పందనను కోరింది. ''ఫిబ్రవరి 15, 2023 నాటికి యూనియన్ ఆఫ్ ఇండియా కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేస్తుంది. పిటీషన్ల బ్యాచ్ మార్చి 21 న విచారణ చేయబడుతుంది'' అని న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

న్యాయవాదులు పూజా ధర్‌, జైకృతి జడేజాలను నోడల్‌ న్యాయవాదిగా నియమించిన అత్యున్నత న్యాయస్థానం, పిటిషన్‌లను సజావుగా విచారించేందుకు పార్టీలు తమ లిఖితపూర్వక సమర్పణలను మార్చి 3లోగా దాఖలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ అంశంపై 2022 మే 11న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన భిన్న తీర్పులకు సంబంధించి ఒక పిటిషన్ దాఖలైంది. దీంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషనర్లలో ఒకరైన ఖుష్బూ సైఫీ.. సుప్రీంకోర్టులో ఈ అప్పీలును దాఖలు చేశారు. మేజర్‌ అయిన భార్యపై బలవంతపు, అసహజ శృంగారానికి పాల్పడిన భర్తను అత్యాచార నేరం నుంచి మినహాయించడం.. చట్టం ముందు అందరం సమానమే అని పేర్కొంటున్న ఆర్టికల్‌ 14కు విరుద్ధమని కర్ణాటక హైకోర్టు 2022 మార్చి 23న తీర్పు ఇచ్చింది.

వైవాహిక అత్యాచారం అనే ఈ సమస్యకు న్యాయపరమైన, "సామాజిక చిక్కులు" కూడా ఉన్నాయని, ఈ పిటిషన్లపై ప్రభుత్వం తన ప్రతిస్పందనను దాఖలు చేయాలనుకుంటున్నదని, దీనిపై రాష్ట్రాల అభిప్రాయాన్ని కేంద్రం కోరిందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.

Next Story