నవజాత శిశువుల అక్రమ రవాణాపై సుప్రీంకోర్టు సీరియస్..హాస్పిటళ్ల లైసెన్స్ రద్దుకు ఆదేశాలు
వజాత శిశువుల అక్రమ రవాణా జరిగితే ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
By Knakam Karthik
నవజాత శిశువుల అక్రమ రవాణాపై సుప్రీంకోర్టు సీరియస్..హాస్పిటళ్ల లైసెన్స్ రద్దుకు ఆదేశాలు
నవజాత శిశువుల అక్రమ రవాణా జరిగితే ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో కొడుకు కావాలని కోరుకునే దంపతులకు దొంగిలించబడిన శిశువు జన్మనిచ్చిన కేసు విచారణలో ఉండగా సుప్రీంకోర్టు ఈ కఠినమైన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుల విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కనబరుస్తున్న తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ఆసుపత్రిలో అయినా చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్లు తేలితే వెంటనే లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులతోపాటు ప్రభుత్వానికి మంగళవారం కఠిన మార్గదర్శకాలు నిర్దేశించింది.
అయితే యూపీలోని ఓ హాస్పిటల్‌లో నవజాత శిశువు కిడ్నాప్‌నకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆ చిన్నారి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే గుర్తు తెలియని వ్యక్తి ఆ చిన్నారిని విక్రయించాడు. అయితే నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా.. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన దంపతులకు నిరాశ మిగిలింది. కేసుపై విచారించిన న్యాయస్థానం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇలాంటి కేసులకు సంబంధించిన విచారణను 6 నెలల లోపు పూర్తిచేయాలని, రోజూవారీ విచారణను కూడా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కుమారుడిని పొందేందుకు ఆశపడిన నిందితుడు, రూ.4 లక్షలకు చిన్నారిని పొందాడని వ్యాఖ్యానించింది. ఒకవేళ నిజంగా బిడ్డ కావాలని అనుకుంటే అక్రమ రవాణా చేసేవారిని సంప్రదించాల్సింది కాదని పేర్కొంది. ఆ చిన్నారిని దొంగతనం చేసి తనకు అందించారనే విషయం నిందితుడికి బాగా తెలుసని చెప్పింది. ఇలాంటివారు సమాజానికి ముప్పు అని వ్యాఖ్యానించింది. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ధర్మాసనం తెలిపింది.