ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ విక్రయానికి సుప్రీంకోర్టు అనుమతి
దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గ్రీన్ పటాకుల విక్రయం, వినియోగానికి సుప్రీం కోర్టు అనుమతి తెలిపింది.
By - Knakam Karthik |
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ విక్రయానికి సుప్రీంకోర్టు అనుమతి
దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గ్రీన్ పటాకుల విక్రయం, వినియోగానికి సుప్రీం కోర్టు అనుమతి తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవై, న్యాయమూర్తి కె. వినోద్ చంద్రన్ ఉన్న ధర్మాసనం ఈ నిర్ణయం వెలువరించింది. తీర్పులో కోర్టు తెలిపిన వివరాల ప్రకారం..అక్టోబర్ 18 నుండి 25 వరకు గ్రీన్ పటాకుల విక్రయానికి అనుమతి ఉంటుంది. పటాకులు పేల్చే సమయం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పరిమితం చేయబడింది. ఈ-కామర్స్ వెబ్‌సైట్లు లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పటాకుల సరఫరా నిషేధం విధించబడింది. పోలీస్ అధికారులు ప్రత్యేక పహారా బృందాలు ఏర్పాటు చేసి, కేవలం అనుమతించిన QR కోడ్ ఉన్న గ్రీన్ పటాకులే విక్రయించబడుతున్నాయా అని పర్యవేక్షించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తక్షణ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.
తీర్పులో కోర్టు వ్యాఖ్యానిస్తూ..సాంప్రదాయ పటాకులు అక్రమ రవాణా ద్వారా మార్కెట్లోకి వస్తూ కాలుష్యం పెంచుతున్నాయని, పరిశ్రమల ఆందోళనలు సమంజసమని పేర్కొంది. గాలి నాణ్యతలో పెద్దగా మార్పు నిషేధం కారణంగా కనిపించలేదని, అయితే కోవిడ్ కాలంలో మాత్రమే గణనీయమైన మార్పు గమనించబడిందని తెలిపింది. ‘అర్జున్ గోపాల్ కేసు’ తీర్పు తర్వాత ప్రవేశపెట్టిన గ్రీన్ పటాకుల వలన గత ఆరు సంవత్సరాల్లో ఉద్గారాలు గణనీయంగా తగ్గాయని, ఇందులో నీరీ (NEERI) కీలక పాత్ర పోషించిందని కోర్టు గుర్తించింది. 2024 అక్టోబర్ 14 నుంచి 2025 జనవరి 1 వరకు పటాకుల తయారీపై నిషేధం అమల్లో ఉండగా, ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజల సాంప్రదాయ ఉత్సవాల మధ్య సమతౌల్యం కోసం సుప్రీం కోర్టు ఈ పరిమిత సడలింపు ఇచ్చింది.