వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) స్లిప్పుల ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) ఓట్లను 100 శాతం ధృవీకరించాలని కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్‌లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

By Medi Samrat  Published on  26 April 2024 6:41 AM GMT
వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) స్లిప్పుల ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) ఓట్లను 100 శాతం ధృవీకరించాలని కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్‌లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో పాటు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయాలన్న పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) లో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో వంద శాతం సరిపోల్చడం కుదరదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈమేరకు ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించింది.

ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పేపర్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలనే డిమాండ్ ను కూడా సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా తోసిపుచ్చింది. ప్రతిపక్షాలు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విస్తృతంగా విచారణ జరిపింది.

తుది తీర్పు చెబుతున్న సంద‌ర్భంగా సుప్రీంకోర్టు రెండు ఆదేశాలు ఇచ్చింది. మొదటిది సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. సింబల్ లోడింగ్ యూనిట్‌లను (SLU) సీలు చేసి కనీసం 45 రోజులు నిల్వ ఉంచాలి. ఇది కాకుండా.. ఫలితాల ప్రకటన తర్వాత ఇంజనీర్ల బృందం ద్వారా ఈవీఎంల మైక్రోకంట్రోలర్ ప్రోగ్రామ్‌ను తనిఖీ చేసే అవకాశం అభ్యర్థులకు ఉంటుందని రెండవ సూచన చేసింది. దీని కోసం.. అభ్యర్థులు ఫలితాలు ప్రకటించిన ఏడు రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి. దాని ఖర్చులను అభ్యర్థి స్వయంగా భరించాలని పేర్కొంది.

రెండు రోజుల సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం బెంచ్ ఏప్రిల్ 18న పిటిషన్లపై తుది నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. అయితే.. బుధవారం సుప్రీంకోర్టు ఈ అంశాన్ని మళ్లీ జాబితా చేసింది. కొన్ని విషయాలపై ఎన్నికల కమిషన్‌ను వివరణ కోరింది. అనంత‌రం కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఈ మేర‌కు జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం శుక్ర‌వారం తీర్పు వెలువరించ‌నున్న‌ట్లు తెలిపింది.

బుధవారం తీర్పును రిజర్వ్ చేస్తూ.. ఎన్నికలను నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తప్పు చేసిన వ్యక్తి పర్యవసానాలను ఎదుర్కోవడానికి చట్టం కింద నిబంధనలు ఉన్నాయి. కేవలం అనుమానం ఆధారంగా కోర్టు మాండమస్‌ మంజూరు చేయదని పేర్కొంది. బ్యాలెట్‌లోకి తిరిగి రావాలని.. ఓటింగ్ యంత్రాల ప్రయోజనాలను అనుమానించే వారి ఆలోచనా విధానాన్ని మార్చలేమని న్యాయస్థానం పేర్కొంది. అలాగే.. బెంచ్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ వ్యాస్‌ను కోర్టుకు పిలిచి ఐదు అంశాలపై వివరణ కోరింది. ఎన్నికల కమిషనర్ వివ‌ర‌ణ అనంత‌రం తుది తీర్పును రిజ‌ర్వు చేసిన కోర్టు నేడు తీర్పు వెలువ‌రించింది.

Next Story