ఇండోర్‌లోని బీఎం కాలేజీకి చెందిన ఓ పూర్వ విద్యార్థి సోమవారం తన కాలేజీ ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అశుతోష్ శ్రీవాస్తవ అనే విద్యార్థి తన మార్కుషీట్ రావడం ఆలస్యం కావడంతో మనస్తాపం చెంది ప్రిన్సిపాల్‌పై దాడి చేశాడు. ఇండోర్ పోలీస్ సూపరింటెండెంట్ భగవత్ సింగ్ విర్దే మాట్లాడుతూ, కళాశాల ప్రిన్సిపాల్ 54 ఏళ్ల విముక్త శర్మ 90 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆమె స్టేట్‌మెంట్ ఇచ్చే పరిస్థితిలో లేరని చెప్పారు. బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తర్వాత కళాశాల సిబ్బంది మంటలను ఆర్పి ఆమెను ఆసుపత్రికి తరలించారు.
నిందితుడికి చేతులు, ఛాతీపై కూడా కాలిన గాయాలయ్యాయి. అతడు పారిపోతూ ఉండగా వాచ్‌మెన్ అతన్ని అడ్డుకుని.. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు, అతను తన నేరాన్ని అంగీకరించాడు. ప్రిన్సిపాల్ తీరు ఎంతగానో ఇబ్బంది పెట్టిందని చెప్పాడు. అశుతోష్ తన ఏడు, ఎనిమిదవ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యాడు. పరీక్షల ఫలితాలు జూలై 2022లో వచ్చాయి. అనేకసార్లు అభ్యర్థించినప్పటికీ, కళాశాల యాజమాన్యం అతనికి మార్క్‌షీట్‌ను అందించలేదు. దీంతో ప్రిన్సిపాల్ ను టార్గెట్ చేసి దాడి చేశాడు.