దూద్‌సాగ‌ర్ జ‌ల‌పాతం వ‌ద్ద కూలిన కేబుల్ బ్రిడ్జి.. టూరిస్టుల‌కు త‌ప్పిన పెను ప్ర‌మాదం

Stranded due to heavy rains 40 tourists rescued near Dudhsagar waterfall in Goa.ప‌ర్యాట‌క ప్రాంతం దూద్‌సాగ‌ర్ జ‌ల‌పాతం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Oct 2022 1:27 PM IST
దూద్‌సాగ‌ర్ జ‌ల‌పాతం వ‌ద్ద కూలిన కేబుల్ బ్రిడ్జి.. టూరిస్టుల‌కు త‌ప్పిన పెను ప్ర‌మాదం

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో గ‌త కొద్ది రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంక‌లు, న‌దులు, చెరువులు పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. ఈ క్ర‌మంలో గోవా-క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దుల్లోని ప‌ర్యాట‌క ప్రాంతం దూద్‌సాగ‌ర్ జ‌ల‌పాతం వ‌ద్ద పెను ప్ర‌మాదం త‌ప్పింది.

శుక్ర‌వారం సాయంత్రం కూడా భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో దూద్‌సాగ‌ర్ జ‌ల‌పాతం నీటి మ‌ట్టం గ‌ణ‌నీయంగా పెరిగింది. నీటి ఉద్దృతికి ఈ జ‌ల‌పాతం వ‌ద్ద మండోవి న‌దిపై ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. వంతెన‌లోని కొంత భాగం కొట్టుకుపోయింది. దీంతో వాట‌ర్ ఫాల్స్ చూసేందుకు వ‌చ్చిన 40 మందికి పైగా పర్యాట‌కులు న‌దిని దాట‌లేక చిక్కుకుపోయారు.

దీన్ని అక్క‌డే విధుల్లో ఉన్న దృష్టి లైఫ్ సేవ‌ర్స్ బృందం గుర్తించింది. చిక్కుకున్న ప‌ర్యాట‌కుల‌ను కాపాడి సుర‌క్షితంగా తీసుకువ‌చ్చింది. ఎటువంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘ‌ట‌న గురించి తెలుసుకున్న గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్.. ప‌ర్యాట‌కుల‌ను కాపాడిన లైఫ్ సేవ‌ర్స్ బృందాన్ని అభినందించ‌డంతో పాటు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

లైఫ్ సేవ‌ర్స్ బృందం ప‌ర్యాట‌కుల‌ను కాపాడిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

భూతల స్వ‌ర్గంగా పిలిచే దూద్‌సాగ‌ర్ జ‌ల‌పాతం చూడ‌డానికి సాధార‌ణంగా వ‌ర్షాకాలంలో ఎవ్వ‌రిని అనుమ‌తించ‌రు. అయితే.. ఇటీవ‌ల వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ప‌ర్యాట‌కుల‌కు అనుమ‌తి ఇచ్చారు.

Next Story