వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మ‌రోసారి రాళ్ల‌దాడి.. ఈ సారి బీహార్‌లో

Stones pelted at Vande Bharat Express in Katihar.వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ పై రాళ్లదాడికి సంబంధించిన మరో ఘటన వెలుగులోకి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jan 2023 11:06 AM IST
వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలుపై మ‌రోసారి రాళ్ల‌దాడి.. ఈ సారి బీహార్‌లో

భార‌త రైల్వే ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ పెట్టిన వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ పై రాళ్లదాడికి సంబంధించిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బీహార్‌లోని కతిహార్ జిల్లా బల్‌రామ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జ‌రిగింది. రైలు నంబరు 22302పై దుండ‌గులు రాళ్ల‌తో దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో సి6 బోగీ విండో అద్దాలు దెబ్బ‌తిన్నాయి. అయితే.. ప్ర‌యాణీకులు ఎవ్వ‌రికి ఎటువంటి గాయాలు కాలేదు.

RPF యొక్క సీనియర్ సెక్యూరిటీ కమిషనర్ కమల్ సింగ్ ఈ సంఘటనను ధృవీకరించారు. సంఘటన స్థలం కతిహార్ జిల్లాలోని బల్రాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని, రాళ్లదాడికి పాల్పడిన వ్యక్తులను కనిపెట్టి అరెస్టు చేయడంలో సహకరించాల్సిందిగా స్థానిక పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)కి కూడా విజ్ఞప్తి చేశారు.

రైలు హౌరా చేరుకున్న తర్వాత సీసీటీవీ ఫుటేజీని తీసుకుని, నిందితులను క‌నిపెట్టి, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామని ఆర్పీఎఫ్ సీనియర్ అధికారి తెలిపారు. ఘటనా స్థలానికి ఆర్పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ చేరుకుని పరిశీలించారు.

డిసెంబ‌ర్ 30న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత నాలుగు రోజుల‌కే రైలు పై రాళ్ల దాడి జరిగింది.

అలాగే.. సికింద్రాబాద్-విశాఖ మధ్య వందేభారత్ రైలు ప్రారంభానికి ముందే విశాఖలో దాడి జరిగింది. ట్రయల్ రన్ ముగించుకుని మర్రిపాలెంలోని కోచ్ మెయింటెనెన్స్ సెంటర్‌కు వెళ్తున్న రైలుపై కంచ‌ర‌పాలెంలో కొందరు దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న‌లో రెండు కోచ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆర్ఫీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి విచార‌ణ చేప‌ట్టారు.

Next Story