వ‌చ్చేవారం నుంచి భార‌త మార్కెట్‌లోకి 'స్పుత్నిక్ వి'

Sputnik V vaccine will be available from next week.గ‌త కొద్ది రోజులుగా దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 May 2021 1:33 PM GMT
వ‌చ్చేవారం నుంచి భార‌త మార్కెట్‌లోకి స్పుత్నిక్ వి

గ‌త కొద్ది రోజులుగా దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. ల‌క్ష‌ల్లో కేసులు న‌మోదు అవుతుండ‌గా.. వేల‌ల్లో ప్ర‌జ‌లు మ‌ర‌ణిస్తున్నారు. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం టీకా పంపిణీని కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. కాగా.. ప‌లు రాష్ట్రాల్లో టీకా కొర‌త వేదిస్తోంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా క‌ట్ట‌డి కోసం ర‌ష్యా అభివృద్ది చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ వ‌చ్చే వారం నుంచి భారత మార్కెట్లలో అందుబాటులోకి వ‌స్తుంద‌ని వెల్ల‌డించింది.

స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను రష్యాకు చెందిన గమలేయా నేషనల్ సెంటర్ అభివృద్ధి చేసింది. స్పుత్నిక్ వి డోసులను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, జులై నుంచి భారత్ లోనే ఈ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తామని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్లను హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఉత్పత్తి చేయనుంది. ఈ నెలాఖరుకు 30 లక్షల స్పుత్నిక్ వి డోసులు భారత్ చేరుకోనున్నాయి. మరోపక్క, ఇటీవల 1.5 లక్షల స్పుత్నిక్ వి డోసులు హైదరాబాద్‌కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు మాత్రమే పంపిణీ చేస్తుండగా.. ఇకపై మూడో వ్యాక్సిన్ కూడా రానుండడంతో వ్యాక్సిన్ కష్టాలు కొద్దిమేర తీరతాయని భావిస్తున్నారు. అంతేకాకుండా అమెరికా ఎఫ్‌డీఏ, ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అనుమ‌తి పొందిన ఏ టీకానైనా రాష్ట్రాలు దిగుమ‌తి చేసుకోవ‌చ్చున‌ని కేంద్రం తెలిపింది. వీటికి ఒక‌టి, రెండు రోజుల్లోనే రాష్ట్రాల‌కు అనుమ‌తి ఇస్తామంది. కాగా.. వ్యాక్సిన్‌ల ద‌ర‌ఖాస్తు కోసం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో లేవ‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. భార‌త్‌లో వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఇప్ప‌టికే ఫైజ‌ర్ సంస్థ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు వెల్లడించిన సంగ‌తి తెలిసిందే.




Next Story