బడ్జెట్‌లో రెండు రాష్ట్రాల ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు : టీఎంసీ ఎంపీ

బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరగడంతో తీవ్ర దుమారం రేగింది. బడ్జెట్‌ను ప్రతిపక్షాలు అసంతృప్తి తెలిపాయి

By Medi Samrat  Published on  24 July 2024 2:58 PM GMT
బడ్జెట్‌లో రెండు రాష్ట్రాల ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు : టీఎంసీ ఎంపీ

బుధవారం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరగడంతో తీవ్ర దుమారం రేగింది. బడ్జెట్‌ను ప్రతిపక్షాలు అసంతృప్తి తెలిపాయి. బడ్జెట్‌పై పలువురు ఎంపీలు పార్లమెంటు వెలుపల కూడా నిరసన తెలిపారు. కాగా బడ్జెట్‌పై చర్చ సందర్భంగా టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ అస్థిర, బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని అన్నారు. బడ్జెట్‌లో కేవలం రెండు రాష్ట్రాల ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారని.. మిగతా పౌరులందరినీ విస్మరించారని ఆరోపించారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజావ్యతిరేకమైనదని, అధికార ఎన్‌డీఏ కూటమి భాగస్వాములను సంతృప్తిపరిచి.. నష్టపరిహారం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నదని అభిషేక్‌ బెనర్జీ అన్నారు. 'బడ్జెట్‌లో విజన్‌, ఎజెండా లేదు. సామాన్యులకు ఊరట లభించడం లేదని.. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలను బడ్జెట్‌ నిర్లక్ష్యం చేసిందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు బీజేపీ అహంకారం.. విభజన రాజకీయాలను తిరస్కరిస్తున్నాయని బెనర్జీ పేర్కొన్నారు.

ఇది భయానక, అస్థిర, బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వమని.. త్వరలోనే ఇది నాశనమవుతుందని అన్నారు. చర్చ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో కూడా వాగ్వాదానికి దిగారు. రైతులు, రైతు సంఘాలు లేదా ప్రతిపక్ష పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే కేంద్రం వ్యవసాయ బిల్లును ఆమోదించిందని అభిషేక్ ఆరోపించారు. దీనిపై ఓం బిర్లా జోక్యం చేసుకుంటూ.. రికార్డు స్పష్టం చేయాలని.. ఈ అంశంపై ఐదున్నర గంటలపాటు సభలో చర్చించామన్నారు.

Next Story