'ఆయ‌న జీవించి ఉంటే సంతోషంగా ఉండేవారు..' రతన్ టాటాను గుర్తు చేసుకున్న ప్రధాని

వడోదరలో ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో తరువాత ఇద్దరు నాయకులు వడోదరలో C295 విమానం యొక్క ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్‌ను ప్రారంభించారు.

By Kalasani Durgapraveen  Published on  28 Oct 2024 2:03 PM IST
ఆయ‌న జీవించి ఉంటే సంతోషంగా ఉండేవారు.. రతన్ టాటాను గుర్తు చేసుకున్న ప్రధాని

వడోదరలో ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో తరువాత ఇద్దరు నాయకులు వడోదరలో C295 విమానం యొక్క ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అంత‌కుముందు ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రధాని వడోదరలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ చేరుకున్నారు.

లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో ఇరు దేశాల ప్రధానుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ప్యాలెస్‌లోనే ఇద్దరూ భోజనం చేస్తారు.వడోదరలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) క్యాంపస్‌లో C-295 విమానాల తయారీ కోసం టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను స్పానిష్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్‌తో కలిసి ప్రధాని మోదీ ప్రారంభించారు.

C-295 కార్యక్రమం కింద 56 విమానాలు తయారవుతాయి. 16 విమానాలు స్పెయిన్ నుండి నేరుగా ఎయిర్‌బస్ ద్వారా సరఫరా చేయబడుతాయి. 40 విమానాలను భారతదేశంలో తయారు చేస్తారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఈ 40 విమానాలను భారత్‌లో తయారు చేయనుంది. అమ్రేలిలో దాదాపు రూ.4900 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.

ప్రధాని మోదీ తన ప్రసంగంలో రతన్ టాటాను గుర్తు చేసుకున్నారు. "ఇటీవల దేశం గొప్ప కుమారుడైన రతన్ టాటా జీని కోల్పోయింది. ఆయ‌న‌ ఈ రోజు మన మధ్య ఉంటే.. సంతోషంగా ఉండేవారు.. కానీ ఆయ‌న ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటుంది, ఈ C-295 ఎయిర్క్రాఫ్ట్ ఫ్యాక్టరీ కొత్త భారత్ కొత్త పని సంస్కృతిని ప్రతిబింబిస్తుందని అన్నారు.

నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు వడోదరలో రైలు కోచ్‌లను తయారు చేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. ఫ్యాక్టరీని కూడా రికార్డు సమయంలో ఉత్పత్తికి సిద్ధం చేశారు. నేడు ఆ ఫ్యాక్టరీలో తయారైన మెట్రో కోచ్‌లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ ఫ్యాక్టరీలో తయారైన విమానాలు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతాయని నాకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

వడోదరలో స్పెయిన్ ప్రెసిడెంట్‌కు స్వాగతం పలికిన పిఎం మోడీ.. "ఇది నా స్నేహితుడు పెడ్రో శాంచెజ్ మొదటి భారతదేశ పర్యటన. భారతదేశం-స్పెయిన్ మధ్య భాగస్వామ్యానికి నేటి నుండి మేము కొత్త దిశను అందిస్తున్నాము. C- 295 ఎయిర్‌క్రాఫ్ట్ ఉత్పత్తి కర్మాగారం భారతదేశం-స్పెయిన్ సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఇది 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్' మిషన్ అని పేర్కొన్నారు.

స్పెయిన్‌లో యోగాకు మంచి ఆదరణ ఉందని నేను విన్నాను.. స్పానిష్ ఫుట్‌బాల్‌కు భారతదేశంలో కూడా చాలా ప్రజాదరణ ఉందని ప్రధాని మోదీ అన్నారు. రియల్ మాడ్రిడ్, బార్సిలోనా మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌ భారత్‌లోనూ చర్చనీయాంశమైంది. బార్సిలోనా విజయంపై భారత్‌లోనూ చర్చ జ‌రిగిందని అన్నారు.


Next Story