భారత్ జోడో యాత్ర : రాహుల్‌తో న‌డిచిన‌ సోనియా, ప్రియాంక, రాబర్ట్ వాద్రా

Sonia, Priyanka join Rahul Gandhi-led Bharat Jodo Yatra in Delhi. కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర శనివారం తెల్లవారుజామున ఢిల్లీలో ప్రవేశించింది.

By Medi Samrat  Published on  24 Dec 2022 2:46 PM IST
భారత్ జోడో యాత్ర : రాహుల్‌తో న‌డిచిన‌ సోనియా, ప్రియాంక, రాబర్ట్ వాద్రా

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర శనివారం తెల్లవారుజామున ఢిల్లీలో ప్రవేశించింది. రాహుల్ గాంధీకి ఈ ఉద‌యం బదర్‌పూర్ సరిహద్దులో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఉత్తరప్రదేశ్ ఇంచార్జ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. సోనియా గాంధీ ముఖానికి మాస్క్ ధరించి యాత్ర‌లో పాల్గొన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీతో క‌లిసి సోనియా గాంధీ ఆశ్రమ చౌక్‌కు వ‌ర‌కూ న‌డిచారు.

ఢిల్లీ వీధుల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో పాటు పార్టీ కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ నేతలు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు నడిచారు. హర్యానాలోని ఫరీదాబాద్ వైపు నుంచి యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించింది. ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్ అనిల్ చౌదరి బదర్‌పూర్‌లోని ఢిల్లీ సరిహద్దు వద్ద రాహుల్‌ గాంధీ, యాత్రికులకు స్వాగతం పలికారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జితు పట్వారీ యాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ యాత్రలో రాహుల్ గాంధీతో కలిశారు.

ఇదిలావుంటే.. సోనియా గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనడం ఇది రెండోసారి. అంతకుముందు, అక్టోబర్‌లో కర్ణాటకలో ఆమె యాత్ర‌లో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.

యాత్రలో భాగంగా హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా, రణదీప్ సూర్జేవాలా, శక్తిసిన్హ్ గోహిల్ తదితర పార్టీల సీనియర్ నేతలు రాహుల్ గాంధీ వెంట ఉన్నారు. భారత్ జోడో యాత్ర దేశ రాజధానిలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో బదర్‌పూర్ నుంచి ఆశ్రమం వరకు భద్రతను పెంచి రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు పలు పాయింట్ల వద్ద పోలీసు సిబ్బంది బృందాలను మోహరించారు.


Next Story