కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ సోనియా, రాహుల్ తీవ్ర విమర్శలు..!
Sonia Gandhi Slams Centre Over Covid. భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే..!
By Medi Samrat Published on 17 April 2021 7:51 PM ISTభారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే..! కరోనా సెకండ్ వేవ్ హెచ్చరికలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులూ కాలయాపన చేసిందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విమర్శలు గుప్పించారు. కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు పటిష్ట వ్యూహాలను రూపొందించాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు, వ్యాక్సిన్లు, మందుల కొరత తీవ్రంగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో వయనాద్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్‌ఛార్జులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమైన తర్వాత సోనియా గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖపై చర్చించారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సహాయం కోసం ప్రధాని మోదీని కోరారని, సంబంధిత మంత్రికి కూడా లేఖలు రాశారని సోనియా గాంధీ చెప్పారు. కొన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత చాలా ఉందని అన్నారు. కొద్ది రోజులకు సరిపడినంత వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. ఆక్సిజన్ లేదని, వెంటిలేటర్లు లేవని చెప్పారని.. ప్రభుత్వం మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పరిస్థితిని సమీక్షించాను. కోవిడ్ సంక్షోభాన్ని కనిపెట్టడంలో, నిరోధించడంలో మోదీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా, ఏమాత్రం సంసిద్ధంగా లేదనే విషయం నా దృష్టికి వచ్చిందని తెలిపారు. వ్యాక్సినేషన్ వయోపరిమితిని 25 ఏళ్లకు కేంద్రం తగ్గించాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ డిమాండ్ చేశారు. లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో అర్హురైన ప్రజలందరికీ రూ.6,000 చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని అన్నారు. ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలు ఇస్తోందని, ఈ సలహాలను వినకుండా, సలహాలిస్తున్న ప్రతిపక్షాలపై దాడి చేయడం కరెక్ట్ కాదని సోనియా గాంధీ తెలిపారు.
కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నా.. ఆ సమస్యను పరిష్కరించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సరైన వ్యూహం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కరోనాని కట్టడి చేయడానికి ఈ ప్రభుత్వం వద్ద సరైన వ్యూహం లేదని.. సరైన వ్యాక్సినేషన్ వ్యూహం కానీ, సరైన ఆక్సిజన్ సరఫరా వ్యూహం కానీ లేవన్నారు. కోవిడ్-19 మహమ్మారికి సంబంధించిన పరిస్థితులను రాహుల్ గాంధీ గత ఏడాదే చెప్పారని.. గత ఏడాది ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ చెప్పిన ప్రతి మాట ఇప్పుడు నిజమవుతోందని కాంగ్రెస్ నాయకులు చెప్పుకొచ్చారు