రిటైర్మెంట్‌పై సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Sonia Gandhi says her innings could conclude with Bharat Jodo Yatra. కాంగ్రెస్ ఎంపీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ కాంగ్రెస్ ప్లీనరీలో కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 25 Feb 2023 2:25 PM IST
కాంగ్రెస్ ఎంపీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ కాంగ్రెస్ ప్లీనరీలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రను పార్టీకి ఒక మేలి మలుపుగా ఆమె అభివర్ణించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పార్టీ 85వ ప్లీనరీలో రెండవ రోజు ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తోందని.. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇది. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసిందని అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన విజయాలు తనకెంతో సంతప్తినిచ్చాయని, కాంగ్రెస్ పార్టీని మలుపుతిప్పిన భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ ముగించాలనుకోవడం సంతోషాన్నిస్తోందని ఆమె అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి, యావద్దేశానికి కూడా ఇది సవాలు వంటి సమయమని, దేశంలోని ప్రతి వ్యవస్థనూ బీజేపీ-ఆర్ఎస్ఎస్ తమ అధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్న తరుణమని అన్నారు. కాంగ్రెస్ ప్లీనరీ రెండో రోజు కార్యక్రమంలో 15,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఇతర విపక్ష పార్టీలతో పొత్తులతో సహా 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని ఈ ప్లీనరీలో తీసుకోనున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు శనివారం ఉదయం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రాయ్‌పూర్ చేరుకున్నారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ విమానాశ్రయంలో ప్రియాంకకు స్వాగతం పలికారు. రాయ్‌పూర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక, ఇతర నాయకులకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు వీధులను పూలతో నింపారు.