పుట్టిన రోజు వేడుకలకు సోనియాగాంధీ దూరం
Sonia Gandhi Birthday Celebrations. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన, రైతు సంఘాల దేశ వ్యాప్త
By Medi Samrat Published on 8 Dec 2020 12:23 PM ISTవ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన, రైతు సంఘాల దేశ వ్యాప్త బంద్ నేపథ్యంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ ఏడాది తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రైతుల ఆందోళనకు తోడు కరోనా వ్యాప్తి నేపథ్యంలో సోనియా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు ఎవరూ తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించవద్దని విజ్ఞప్తి చేశారు.
క్రూరమైన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరారు. సోనియా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులకు లేఖలు రాశారు.
సోనియా గాంధీ అసలు పేరు అడ్విగె ఆంతోనియా మాయినో. సోనియా గాంధీ 9 డిసెంబర్ 1946లో ఇటలీలో జన్మించారు. 1998 నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సోనియా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్యగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన ఆమె.. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత ప్రధాని పదవి తీసుకోమని అడుగగా నిరాకరించారు. 1997లో రాజకీయ రంగప్రవేశం చేసిన సోనియా 1998లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎన్నికయారు. 2004 నుంచి సోనియా గాంధీ లోక్ సభలోని యునైటెడ్ ప్రాగ్రెసివ్ ఎలియన్స్‌కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబరు 2010లో వరుసగా నాలుగోసారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎంపికవడంతో 125 ఏళ్ళ చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి అతి ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా వ్యవహరించిన వారిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె విదేశీయురాలు కావడం ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది.