తనను, తన తండ్రిని అసభ్యకర వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఓ వ్యక్తిపై సహకార శాఖ మంత్రి ఎస్‌టీ సోమశేఖర్ కుమారుడు ఫిర్యాదు చేశారు. నిందితుడు తమను అసభ్యకర వీడియో క్లిప్పింగ్‌లతో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు అడిగారని, లేని పక్షంలో ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బాధితుడు నిశాంత్ సోమశేఖర్ తెలిపారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. నిందితుడిని ప్రముఖ జ్యోతిష్యుడు చంద్రశేఖర్ భట్ కుమారుడు రాహుల్ భట్ (22)గా గుర్తించారు. నిశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు భట్‌ను అరెస్ట్ చేశారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. తదుపరి దర్యాప్తు జరుగుతోంది. నిందితుడు నిశాంత్‌కు శత్రువు అని తెలుస్తోంది. నిందితుడు తన తండ్రి వ్యక్తిగత కార్యదర్శిని సంప్రదించి నకిలీ అసభ్యకర వీడియో క్లిప్పింగ్‌లతో బ్లాక్‌మెయిల్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదుదారు ఒక మహిళతో ఉన్నట్టు వీడియోలు ఉన్నట్లు తెలిసింది. తన తండ్రి వ్యక్తిగత కార్యదర్శులు తమ మొబైల్ ఫోన్‌లలో అసభ్యకరమైన క్లిప్పింగ్‌లు, వీడియోలు చూశారని నిశాంత్ ఆరోపించాడు.
తనతో పాటు తన తండ్రి రాజకీయ ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశ్యంతో వీడియోలను ఎడిట్ చేశారని, ఈ చర్య వెనుక ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన వెనుక ఉన్న కుట్రను నిర్ధారించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇతరుల ప్రమేయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. భట్‌ను వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నామని, వీడియో క్లిప్పింగ్‌లు పంపిన నంబర్‌ను కూడా టీమ్ ట్రేస్ చేస్తోందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిసింది.