మంచు తుఫాను కారణంగా గల్లంతైన ఓ జవాను ఆచూకీ 38 సంవత్సరాల తరువాత లభ్యమైంది. 19 కుమావు రెజిమెంట్‌కు చెందిన చంద్రశేఖర్ మృతదేహం సియాచిన్‌లోని ఓ పాత బంకర్‌లో కనుగొన్నట్లు ద సైనిక్ గ్రూప్ సెంటర్ రానీఖెత్ తెలిపింది. మృతదేహం పక్కనే లభించిన ఐడెంటిఫికేషన్ డిస్క్‌లపై ఉన్న ఆర్మీ నంబరు ఆధారంగా ఆ మృతదేహాన్ని చంద్రశేఖర్ దిగా గుర్తించారు.
1984లో 'ఆపరేషన్ మేఘదూత్'లో భాగంగా పాకిస్థాన్‌తో పోరాడేందుకు చంద్రశేఖర్ సహా 20 మంది జవాన్లు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్‌లో మోహరించారు. అయితే.. మే 29న మంచు తుపాన్ విరుచుకుపడింది. దీంతో 20 మంది సైనికులు అమరులు అయ్యారు. వీరిలో 15 మంది మృతదేహాలను సైన్యం గుర్తించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చంద్రశేఖర్ తో పాటు మరో నలుగురి ఆచూకీ లభించలేదు.
ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలోని ద్వారాహట్ చంద్రశేఖర్ హర్బోలా స్వస్థలం. 1975లో సైన్యంలో చేరారు. గల్లంతు కావడానికి 9 ఏళ్లు ముందు శాంతి దేవితో ఆయనకు వివాహమైంది. వారికి ఓ కుమార్తె, కుమారుడు సంతానం. హల్‌ద్వానీ సబ్ కలెక్టర్ మనీశ్ కుమార్, తహసీల్దార్ సంజయ్ కుమార్ జవాను నివాసానికి వెళ్లారు. పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.
కాగా.. చంద్రశేఖర్‌తో పాటు మరో మృతదేహం లభ్యమైనా.. అది ఎవరిది అనేది గుర్తించాల్సి ఉంది.