167.2 కోట్లకు అమ్ముడుపోయిన రాజా రవివర్మ 'యశోద కృష్ణ' పెయింటింగ్
By - Medi Samrat |
ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ గీసిన 'యశోద కృష్ణ' అనే ఆయిల్ పెయింటింగ్ రికార్డు స్థాయిలో రూ. 167.2 కోట్లకు అమ్ముడుపోయి భారతీయ కళాకృతుల వేలంలో కొత్త రికార్డును సృష్టించింది. బుధవారం ముంబైలో 'సాఫ్రాన్‌ఆర్ట్' నిర్వహించిన స్ప్రింగ్ లైవ్ వేలంలో తీవ్రమైన పోటీ తర్వాత, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు, బిలియనీర్ అయిన సైరస్ పూనావాలా ఈ అద్భుతమైన పెయింటింగ్‌ను కొనుగోలు చేశారు.
గతేడాది ఎం.ఎఫ్. హుస్సేన్ గీసిన 'అన్‌టైటిల్డ్' అనే పెయింటింగ్‌ను కిరణ్ నాడార్ అనే వ్యక్తి రూ. 118 కోట్లకు కొనుగోలు చేశారు. తాజా వేలంతో ఆ పాత రికార్డు బద్దలైంది. ఈ పెయింటింగ్ రూ. 80 కోట్ల నుంచి రూ. 120 కోట్లు పలుకుతుందని అంచనా వేయగా, దాదాపు రెట్టింపు ధర రావడం విశేషం. ఈ పెయింటింగ్‌ను కొనుగోలు చేయడం ఒక గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నానని సైరస్ పూనావాలా చెప్పారు. ఇది ఒక జాతీయ సంపద.. దీన్ని ప్రజలు ఎప్పటికప్పుడు వీక్షించేలా అందుబాటులో ఉంచడానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. 1890ల కాలంలో రాజా రవివర్మ గీసిన అత్యుత్తమ చిత్రాలలో ఇది ఒకటి. ఇందులో యశోద ఆవు పాలు పితుకుతుండగా, చిన్నారి కృష్ణుడు ఆమె వెనుక నుంచి పాల కోసం చేయి చాచుతున్నట్లు చాలా సహజంగా, అద్భుతంగా చిత్రీకరించారు.