నిత్యం మంచుతో కప్పబడి ఉండే హిమాలయాల అందం గురించి ఎంత పొగిడినా తక్కువే. కొండలు.. ఆపక్కనే లోయలు, చల్లని ప్రశాంత వాతావరణం... ఒక్కో అడుగూ పైకి వెళ్తుంటే వెండికొండల్లా తళుకులీనే తెల్లని మంచుకొండలు.. అవే ఉదయ, సాయంత్రాల్లో బంగారు రంగులో మెరిసిపోతుంటాయి. హిమాలయాల అందాలను కళ్లతో చూడాలే కానీ మాటలతో వర్ణించలేం. అంతటి అద్భుతమైన ప్రాంతాలను సందర్శించడం ప్రతి ఒక్కరికి జీవిత కాల స్వప్నం.
అయితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సహారాన్ పూర్ పట్టణ వాసులకు మాత్రం ఒక అద్భుత అవకాశం దక్కింది. గతేడాది లాగే ఈ సంవత్సరం కూడా వాళ్ల కళ్ళముందుకే హిమాలయాలు కదిలి వచ్చాయి. పెరుగుతున్న కాలుష్యం కారణంగా దూరం నుంచే మంచుకొండలు కనిపించే అవకాశం ఎప్పుడో పోయింది. అయితే వరుసగా రెండో ఏడాది లాక్‌డౌన్ నిబంధనల కారణంగా కాలుష్యం తగ్గిపోయింది. దాంతో సహారాన్ పూర్ వాసులు హిమాలయాల ధగధగలు, నిగనిగలు చూసి పులకించిపోతున్నారు. చాలామంది ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు.
రెండు రోజులు వర్షాలు కురిసి మబ్బులు తొలగిపోయిన తర్వాత ఉత్తర దిశగా చూస్తే హిమాలయాలు స్పష్టంగా కనిపించాయని, 30-40 ఏళ్ల క్రితం వరకూ ఇలాగే కనిపించేవనీ, కానీ కాలుష్యం పెరుగుతున్నకొద్దీ అవి కనిపించడమే అరుదైపోయిందని చెబుతున్నారు. ఈ విషయం పై కొందరు ఫోటో గ్రాఫర్లతో పాటూ ఒక ఐఏఎస్ అధికారి కూడా ట్వీట్ చేశారు. సహారాన్ పూర్ నుంచి అప్పర్ హిమాలయాలకు దాదాపు 150 కిలోమీటర్లు ఉంటుంది.