అమెరికాలోని కాలిఫోర్నియాలోని స్టాక్‌టన్ సిటీలో జరిగిన కాల్పుల్లో డ్రగ్స్ స్మగ్లర్ అయిన సునీల్ యాదవ్ హతమయ్యాడు. ఈ హత్య తమ పనేనంటూ బిష్ణోయ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించుకుంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్లు గోల్డీ బ్రార్, రోహిత్ గొడారా ఈ హత్య వెనుక ఉన్నట్లు తెలిపారు.
సునీల్ పంజాబ్ పోలీసులతో కుమ్మక్కై తమ సోదరుడు అంకిత్ భాదు మరణానికి కారణమయ్యాడని, అందుకే ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు. అంకిత్ ఎన్‌కౌంటర్ వెనక తన ప్రమేయం ఉందని వెలుగులోకి వచ్చిన మరుక్షణమే సునీల్ అమెరికాకు పారిపోయాడు. అయినా కూడా అతడిని బిష్ణోయ్ గ్యాంగ్ వదిలిపెట్టలేదు. శత్రువులారా సిద్ధంగా ఉండండి.. మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మిమ్మల్ని అంతం చేస్తామంటూ బహిరంగ హెచ్చరికలు జారీ చేసింది బిష్ణోయ్ గ్యాంగ్.
రాజస్థాన్‌లో పలు కేసుల్లో వాంటెడ్ గా ఉన్న సునీల్ యాదవ్ పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి డ్రగ్స్‌ను తీసుకొస్తూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం 300 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటనలో అతని పేరు బయటపడింది. యూఎస్, దుబాయ్ అంతటా అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్‌లో సునీల్ ప్రమేయం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.