మంత్రుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న సీడీలు.. కోర్టులో ఆరుగురి పిటిషన్.. ఎందుకంటే..?
Six Karnataka ministers move court seeking injunction against media houses. ఇటీవల కర్ణాటక మంత్రి రాసలీలల సీడీ బయట పడటంతో ఆ రాష్ట్రంలో పెను దుమారం రేగింది.
By Medi Samrat
ఇటీవల కర్ణాటక మంత్రి రాసలీలల సీడీ బయట పడటంతో ఆ రాష్ట్రంలో పెను దుమారం రేగింది. రాసలీలకు పాల్పడిన మంత్రి వీడియో బయటకు రావడంతో ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. తాజాగా వీడియో సీడీలంటేనే మంత్రులు గజగజ వణికిపోతున్నారు. తమకు చెందిన ఏవైనా సీడీలు, వీడియోలు ఉంటే పత్రికలు, టీవీ ఛానెళ్లలో ప్రసారం కాకుండా చూడాలని పలువురు మంత్రులు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. అంగీకరిస్తూ తాత్కాలిక అనుమతులు ఇచ్చింది. సిటీ సివిల్ కోర్టు వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం.. పిటిషన్ దాఖలు చేసిన మంత్రులు ప్రకాశం శివరాం హెబ్బార్, బీసీ పాటిల్, హెచ్‌టీ సోమశేఖర్, కె. సుధాకర్, నారాయణగౌడ, బైరతి బసవరాజులు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే మంత్రుల పిటిషన్‌పై విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆరుగురు మంత్రులను రాష్ట్ర మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జేడీఎస్ ఎమ్మెల్యే మహేష్ మాట్లాడుతూ.. తమకు సంబంధించిన వీడియోలు ఏమైనా ఉంటే మీడియాలో ప్రసారం కాకుండా ఆదేశాలు ఇవ్వాలని మంత్రుల న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, అలాంటి వారు పిటిషన్ వేశారంటే తప్పు చేసినట్లే కనిపిస్తోందని ఆరోపించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అయితే మంత్రి పదవుల్లో ఉన్నవారు ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడం అసెంబ్లీని అవమానపర్చడమేనని అన్నారు. మీరు తప్పు చేయకుంటే కోర్టును ఎందుకు ఆశ్రయించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు తప్పు చేశారు కాబట్టి ఆ వీడియోలు బయటకు వస్తే మీ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారని ఆయన మండిపడ్డారు.
కాగా, తమ సీడీలను విడుదల కాకుండా చూడాలని కొందరు కర్ణాటక మంత్రులు కోరుతుండగా, మంత్రులు, ఎమ్మెల్యేలు అనవసరంగా కోర్టుకు వెళ్లడం సరైంది కాదని కేంద్ర మంత్రి సదానంద గౌడ అన్నారు. రాసలీలల సీడీపై పార్టీ జాతీయ అధ్యక్షుడికి పార్టీ ఇన్‌చార్జ్ సమాచారం అందించారు.