ఢిల్లీ ఎక్సైజ్ విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విషయమై.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ దర్యాప్తు జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేసి.. బీజేపీలో చేరితే.. తనపై ఉన్న అన్ని కేసులను తనను కొందరు సంప్రదించినట్లు ఆయన వెల్లడించారు. అయితే తాను "మహారాణా ప్రతాప్, రాజ్‌పుత్ వారసుడిని. తల నరక్కుంటాను. కానీ మీలాంటి కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎన్నటికీ తల వంచను" అని సమాధానం ఇచ్చానని చెప్పారు.
"బీజేపీ నుంచి నాకు ఓ మెసేజ్ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరితే.. సీబీఐ, ఈడీ పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తామన్నారు. దానికి ఘాటుగా సమాధానం ఇచ్చాను. నేను మహారాణా ప్రతాప్, రాజ్‌పుత్ వారసుడిని. తల నరక్కుంటాను. కానీ మీలాంటి కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎన్నటికీ తల వంచను. నాపైన పెట్టిన కేసులన్నీ అబద్ధం. మీరు చేయాలనుకున్నది చేసుకోండి" అని సిసోడియా అన్నారు. సిసోడియా ట్వీట్‌ను బీజేపీ నేత మనోజ్ తివారీ ఖండించారు. అవినీతిలో ఇరుక్కున్న సిసోడియా కట్టు కథలు చెబుతున్నారని తివారీ ఆరోపించారు. మరోవైపు.. మద్యం వ్యవహారంలో సిసోడియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.