ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో సీబీఐ అరెస్టు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఆయన శుక్రవారం రోస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 28న సిసోడియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందు హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. సిసోడియా దేశ రాజధానిలో లిక్కర్ పాలసీని రూపొందించడంలో అవకతవకలకు పాల్పడ్డారని అవినీతి ఆరోపణను ఎదుర్కొంటున్నారు.
అరెస్టు జరిగిన తరువాత సిసోడియా తన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే గతంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న మరో మంత్రి సత్యేందర్ జైన్ కూడా తన పదవి నుంచి వైదొలిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అయిన అతిషి, సౌరభ్ భరద్వాజ్ లను మంత్రులుగా నియమించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కు సిఫారుసు చేశారు.