కర్ణాటక ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యే అవకాశం ఉంది. సిద్ధరామయ్య సాయంత్రం ఖర్గేను ఆయన నివాసంలో కలిసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది మర్యాదపూర్వక భేటీ అని కాంగ్రెస్ నేతలు చెబుతుండగా, రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై సిద్ధరామయ్య చర్చించే అవకాశం ఉందని సమాచారం.
సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల “అధికార భాగస్వామ్యం” ఒప్పందాన్ని ఉటంకిస్తూ రాష్ట్ర రాజకీయ వర్గాలలో ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి మార్పు గురించి కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఇదిలావుండగా.. తాను పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా కొనసాగుతున్నానని, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేశారన్న చర్చను శివకుమార్ కొట్టిపారేశారు. శివకుమార్ ఆదివారం కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమయ్యారు. సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటనలో ప్రధానిని కూడా కలవనున్నారు.
ప్రధానితో జరిగే సమావేశంలో చెరుకు రైతుల సమస్యలు, మహాదాయి, మేకేదాటు నీటి ప్రాజెక్టులకు పెండింగ్‌లో ఉన్న అనుమతులపై సీఎం చర్చించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. తమ ఉత్పత్తులకు టన్నుకు రూ. 3,500 అధిక ధరను డిమాండ్ చేస్తున్న చెరకు రైతుల సమస్యలపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్ కోరుతూ నవంబర్ 6న ప్రధానికి సిద్ధరామయ్య లేఖ రాశారు.