శ్రద్ధా వాకర్ హత్య కేసుకు భయపడే తునీషాతో బ్రేకప్.. విచార‌ణ‌లో షీజన్ ఖాన్

Shraddha Walker murder case forced breakup with Tunisha Sharma. హిందీ టెలివిజన్ నటి తునీషా శర్మ ఆత్మహత్య చేసుకుంది.

By M.S.R  Published on  26 Dec 2022 5:43 PM IST
శ్రద్ధా వాకర్ హత్య కేసుకు భయపడే తునీషాతో బ్రేకప్.. విచార‌ణ‌లో షీజన్ ఖాన్

హిందీ టెలివిజన్ నటి తునీషా శర్మ ఆత్మహత్య చేసుకుంది. ఓ సీరియల్ షూటింగ్ సెట్ లో సహ నటుడి మేకప్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. తునీషా ఆత్మహత్యకు ఆమె సహనటుడైన షీజన్ ఖాన్ మహ్మద్ కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తునీషాను ఆత్మహత్యకు ప్రేరేపించాడని ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో షీజన్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు కస్టడిలో ఉన్న షీజన్.. తునీషా శర్మ ఇది వరకు కూడా ఆత్మహత్నాయత్నం చేసిందని, తానే ఆమెను రక్షించినట్లు చెప్పాడు. ఈ విషయాన్ని తునీషా తల్లికి తెలిపానని, ఆమెను బాగా చూసుకోమని కోరినట్లు తెలిపాడు. ఈ క్రమంలో నటుడి వాంగ్మూలం వెనుక ఉన్న వాస్తవాలను పోలీసులు ధ్రువీకరించే పనిలో ఉన్నారు.

షీజన్ ఖాన్ తునీషా శర్మతో సంబంధం ఉన్నట్లు ఒప్పుకున్నాడు. భిన్న వర్గాలకు చెందినవారు కావడం, ఇద్దరి మధ్య వయసు అంతరం ఎక్కువగా ఉండటం కూడా ఆమె విడిపోవడానికి ప్రేరేపించిందని షీజన్ పోలీసులకు చెప్పాడు. తునీషా ఆత్మహత్యకు బ్లాక్ మెయిల్ లేదా లవ్ జిహాద్ కోణం ఉందనే కారణం ఏమీ కనిపించలేదని ఏసీపీ చంద్రకాంత్ జాదవ్ తెలిపారు. తునీషా శర్మ ఉరివేసుకుని చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో నిర్ధారించారు.

దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసుకు భయపడే బ్రేకప్ చెప్పినట్టు షీజన్ ఖాన్ మహ్మద్ చెప్పుకొచ్చాడు. వేరే కమ్యూనిటీకి చెందిన యువతి కావడం కూడా తాము విడిపోడానికి కారణమని చెప్పుకొచ్చాడు. శ్రద్ధా ఘటనతో దేశంలో నెలకొన్న పరిస్థితితో ఆందోళన చెంది, తునిషాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా బ్రేకప్ అయినట్టు వెల్లడించారు. అయితే వయస్సు బేధం కూడా కారణమని అన్నారు. ఇంగ్లండ్ నుంచి ఆమె అత్త రాకతో మంగళవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


Next Story