ముఖ్యమంత్రి పదవిపై కర్ణాటక కాంగ్రెస్‌లో గుబులు మొదలైంది. డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శివగంగ బసవరాజ్ సోమవారం అన్నారు. బళ్లారి జిల్లా కొత్తూరులో ఎమ్మెల్యే బసవరాజ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘మొదటి నుంచి శివకుమార్ పార్టీని నిర్మించారని.. ఆయనే ముఖ్యమంత్రి కావాలన్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఒక సీటు నుంచి.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తొమ్మిది సీట్లు గెలవడానికి ఆయనే కారణం. శివకుమార్ సీఎం కావడం ఖాయం. ఆయన సీఎం అయ్యాక డజను మంది డీప్యూటీ సీఎంలను నియమించవచ్చని అన్నారు.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు సీఎం అవడం కాంగ్రెస్ సంప్రదాయమని.. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైకమాండ్ కొన్ని కారణాల వల్ల సిద్ధరామయ్యను సీఎం చేసిందని బసవరాజ్ తెలిపారు. కెపిసిసి అధ్యక్షుడిగా శివకుమార్ పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేశారన్నారు. మరిన్ని డీప్యూటీ సీఎం పదవులు కావాలనే మంత్రి కేఎన్ రాజన్న డిమాండ్‌పై ఆయనను ప్రశ్నించగా.. ఆసక్తి ఉన్నవారు హైకమాండ్‌తో చర్చించాలని బసవరాజ్ అన్నారు. రాజన్న లాంటి సీనియర్ నాయకులు మాలాంటి జూనియర్ నాయకులకు ఆదర్శంగా నిలవాలి. శివకుమార్ హెచ్చరించినప్పటికీ.. ఆయన ప్రకటనలు చేస్తూనే ఉన్నాడని ఆయన అన్నారు.
సీటును ఖాళీ చేయాలని వొక్కలిగ పీఠాధిపతి.. సీఎం సిద్ధరామయ్యకు విజ్ఞప్తి చేయడంపై బసవరాజ్ మాట్లాడుతూ.. ఇది ప్రజలు.. భక్తుల మనోభావాలను ప్రతిబింబిస్తుందని అన్నారు. ‘‘బీజేపీ బ్యాక్‌డోర్ నుంచి అధికారంలోకి రావాలని ప్రచారం చేస్తోంది. అధికారం కోసం బీజేపీ పగటి కలలు కనడం మానేయాలని.. కాంగ్రెస్ తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోబోతోందని ఆయన అన్నారు.
సీఎం పదవి, అదనపు డిప్యూటీ సీఎం పదవుల గురించి అడిగిన ప్రశ్నలకు సిఎం సిద్ధరామయ్య బెంగళూరులో స్పందిస్తూ.. “ఇది బహిరంగ చర్చకు సంబంధించిన విషయం కాదు. మేము హైకమాండ్ నిర్ణయాన్ని అనుసరిస్తాము అని బదులిచ్చారు.