రాజకీయ కుట్రలో భాగంగానే దాడులు
Shiv Sena MP Sanjay Raut to Enforcement Directorate’s custody. శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్‌ను ఈడీ అధికారులు
By Medi Samrat Published on 1 Aug 2022 9:15 PM IST
శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్‌ను ఈడీ అధికారులు ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. పాత్రచాల్ భూ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో సంజయ్ రౌత్‌ను సుమారు 8 గంటలపాటు ప్రశ్నించారు. ఈడీ అధికారులు CISF సిబ్బందితో పాటు భారీ భద్రత మధ్య సోదాలు నిర్వహించారు.
సంజయ్ రౌత్ ను పీఎంఎల్ఏ కోర్టు ముందు సోమవారం మధ్యాహ్నం హాజరుపరిచారు. లెక్కల్లో చూపించని నగదును సంజయ్ రౌత్ నివాసం నుంచి ఈడీ ఆదివారంనాడు స్వాధీనం చేసుకుంది. దీనిపై ఈడీ అధికారులు ఆయనను విచారించి సోమవారం మధ్యాహ్నం 12.05 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం పీఎంఎల్ఏ కోర్టు ముందు హాజరుపరిచారు. పాత్రచాల్ కుంభకోణంతో సంజయ్ భార్య వర్షా రౌత్ సహా మరికొందరు ఆయన సన్నిహితులకు సంబంధం ఉందన్నది ప్రధాన అభియోగం. ఈ క్రమంలో ఏప్రిల్‌లో వర్షా రౌత్‌కు చెందిన 11 కోట్ల 15 లక్షు విలువ చేసే ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులు చేస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు.
సంజయ్ రౌత్ ను ఇవాళ ముంబయి స్పెషల్ కోర్టులో హాజరుపర్చగా.. ఆగస్టు 4 వరకు కస్టడీ విధించారు. ఇంటి నుంచి భోజనం, ఔషధాలు స్వీకరించేందుకు కోర్టు రౌత్ కు అనుమతి మంజూరు చేసింది. ఒకవేళ విచారణ సమయంలో అవసరమైతే చికిత్స కూడా పొందే వెసులుబాటు కల్పించింది. సంజయ్ రౌత్ హృద్రోగంతో బాధపడుతున్నారని, అందుకు గాను చికిత్స పొందుతున్నారని ఆయన తరఫు న్యాయవాది అశోక్ ముందర్గీ కోర్టుకు వివరించారు. ఆయనకు ఇప్పటికే శస్త్రచికిత్స కూడా జరిగిందని వెల్లడించారు.