'మహా' ఉత్కంఠకు తెర.. డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్న షిండే..!

మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండేపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.

By Medi Samrat  Published on  4 Dec 2024 3:15 PM GMT
మహా ఉత్కంఠకు తెర.. డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్న షిండే..!

మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండేపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గురువారం బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో పాటు ఏక్‌నాథ్ షిండే కూడా డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణం చేస్తార‌ని శివసేన వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి.. మహాయుతి ప్రభుత్వ ఏర్పాటులో ఏక్‌నాథ్ షిండే స్టాండ్‌పై చాలా కాలంగా చర్చ జరుగుతోంది.

బుధవారం మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను క‌లిసిన‌ మహాయుతి నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు. మహాయుతిలో భాగమైన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ రాజ్ భవన్‌లో గవర్నర్‌కు ఎమ్మెల్యేల మద్దతు లేఖలు అందజేశారు.

బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవికి నా పేరుకు మద్దతు ఇచ్చినందుకు శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండేకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా నా పేరును సిఫారసు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలు కేవలం సాంకేతిక పదవులేనని ఫడ్నవీస్ అన్నారు. గత రెండున్నరేళ్లుగా కలిసి పనిచేశాం. భవిష్యత్తులో కూడా అందరం కలిసి మంచి ప్రభుత్వాన్ని అందించడానికి ప్రయత్నిస్తాం. ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడమే మా ప్రయత్నం అన్నారు. మహారాష్ట్రను కొత్త శిఖరాలకు తీసుకెళ్తానన్న ప్రతిజ్ఞను కూడా నెరవేరుస్తానని, నేను ఏక్‌నాథ్ షిండేను కలిశానని, ఈ ప్రభుత్వంలో ఆయన మాతో ఉండాలని కోరుకున్నానని అన్నారు. ఆయ‌న‌ మాతోనే ఉంటాడని నాకు పూర్తి నమ్మకం ఉందన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మహాయుతికి మెజారిటీ వచ్చింది. దీని తర్వాత ప్రభుత్వ ఏర్పాటు, సీఎం పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఫడ్నవీస్‌ను సీఎం చేసినందుకే ఏకనాథ్ షిండేకు కోపం వచ్చిందని అంతా భావించారు. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయాన్ని తాను అంగీకరిస్తానని షిండే ఆదివారం స్పష్టం చేశారు. అనంతరం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక తన సొంత ఊరు సతారా వెళ్లారు. అదే సమయంలో ఆయనకు కీలక పదవి ఇవ్వాలని శివసేన ఒత్తిడి తెచ్చింది.

Next Story