మనోభావాలు దెబ్బతీశారు.. ఓవైసీ సోదరులపై చర్యలు తీసుకోండి : షిండే శివసేన వర్గం
ఓవైసీ సోదరులపై చర్యలు తీసుకోవాలని షిండే శివసేన వర్గం డిమాండ్ చేసింది.
By Medi Samrat Published on 16 Nov 2024 7:45 PM ISTఓవైసీ సోదరులపై చర్యలు తీసుకోవాలని షిండే శివసేన వర్గం డిమాండ్ చేసింది. వర్గాల మధ్య హింసను ప్రేరేపిస్తూ, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీలపై చర్యలు తీసుకోవాలని శివసేన డిమాండ్ చేస్తోంది. మహారాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ముంబై పోలీస్ కమిషనర్‌కు శివసేన లేఖ రాసింది. షోలాపూర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగా రాష్ట్రంలో అశాంతి నెలకొందని షిండే వర్గం శివసేన ఆరోపించింది. శివసేన సోషల్ మీడియా ఇంఛార్జి రహూల్ కనాల్ రాసిన లేఖలలో ఒవైసీ సోదరులిద్దరూ తమ ప్రసంగాల ద్వారా రాష్ట్రంలోని వివిధ వర్గాల మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. ఒవైసీ సోదరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, వీడియో ప్రామాణికతను ధృవీకరించడమే కాకుండా సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన అక్బరుద్దీన్ ఒవైసీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రధాని మోదీ దేశ ప్రజలను విభజించాలని చూస్తున్నారన్నారు. MIM అలాంటి మత విధ్వంసకర శక్తులను అడ్డుకుంటుందన్నారు. తనకు పదిహేను నిమిషాలు టైమ్ ఇస్తే.. దేశంలోని మెజారిటీ ప్రజలకు తామేంటో చూపిస్తామన్నారు.