ఆ రెండు జిల్లాల పేర్లను మారుస్తూ నోటిఫికేషన్

మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లను మారుస్తూ

By Medi Samrat  Published on  16 Sept 2023 2:25 PM IST
ఆ రెండు జిల్లాల పేర్లను మారుస్తూ నోటిఫికేషన్

మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లను మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పు గురించి కొన్ని నెలల క్రితం సూచనలను, అభ్యంతరాలను పరిశీలించి సబ్ డివిజన్, గ్రామ, తాలూకా, జిల్లా స్థాయిల్లో పేర్లను మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం రెవెన్యూశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే సర్కార్ ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ జిల్లా పేరును ధారాశివ్‌గా మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

15 సెప్టెంబర్ 2023న, మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మరాఠ్వాడా ప్రాంతంలోని రెండు ముఖ్యమైన ప్రాంతాల పేరు మార్చే ప్రక్రియను అధికారికంగా పూర్తి చేసినట్లుగా ఒక గెజిట్‌ను విడుదల చేసింది. ఔరంగాబాద్.. ఉస్మానాబాద్ ప్రాంతాల పేర్లను ఛత్రపతి శంభాజీనగర్, ధారాశివ్‌గా మార్చారు. మహారాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రచురించిన గెజిట్‌లో రెవెన్యూ శాఖ రెవెన్యూ ప్రాంతాల పేర్లను మారుస్తున్నట్లు పేర్కొంది. ఔరంగాబాద్ జిల్లాను ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాగా ఇకపై పిలవనున్నారు. 2022 జూన్ 29న అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం క్యాబినెట్ సమావేశంలో ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో ఏక్‌నాథ్ షిండే వర్గం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది ఆ తర్వాత ఏక్‌నాథ్ షిండే సీఎం అయ్యారు.

Next Story