నా భార్య పుట్టుకతో ఆడది కాదు.. నన్ను మోసం చేశారు.. సుప్రీంకోర్టు మెట్లెక్కిన భర్త
She's a man, it's definitely cheating.. Man moves Supreme Court for divorce. తన భార్య "బాహ్య పురుష జననాంగ నిర్మాణాన్ని" కలిగి ఉందని ఆరోపిస్తూ, మోసానికి పాల్పడినందుకు ఆమెపై క్రిమినల్
By అంజి Published on 14 March 2022 8:34 AM GMTతన భార్య "బాహ్య పురుష జననాంగ నిర్మాణాన్ని" కలిగి ఉందని ఆరోపిస్తూ, మోసానికి పాల్పడినందుకు ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక వ్యక్తి సుప్రీం కోర్టు మెట్లెక్కాడు. తన భార్యకు పురుష జననేంద్రియాలు ఉన్నాయని గుర్తించిన తర్వాత తన భార్య, మామ మోసం చేశారని ఆరోపిస్తూ గ్వాలియర్‌కు చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. ఈ కేసును విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం తొలుత విముఖత వ్యక్తం చేసినప్పటికీ, వైద్య నివేదికను పరిశీలించిన తర్వాత మహిళకు నోటీసులు జారీ చేసింది. భార్య యొక్క వైద్య నివేదికలో.. ఆమె జీవశాస్త్రపరంగా స్త్రీ అని, అండాశయాలతో స్త్రీగా గుర్తించబడింది. అయితే ఆ మహిళకు "బాహ్య పురుష జననేంద్రియాలు" కలిగి ఉన్న "అపరిపూర్ణ కన్నెపొరకు తోడు బాహ్య పురుషాంగం" వంటి వాటిని కలిగి ఉందని కూడా పేర్కొంది.
కేసు దేనికి సంబంధించింది?
అప్పీలుదారు ప్రకారం.. ఈ జంట 2016 లో వివాహం చేసుకున్నారు. అయితే భార్య సంసార జీవితానికి కొన్ని రోజులుగా నిరాకరించింది. ఈ జంట చివరకు కలిశాక.. భార్య జననాంగాలలో కొన్ని "మగ" లక్షణాలు ఉన్నాయని భర్త కనుగొన్నాడు. భర్త తన భార్యను వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లాడు. ఇది ఆమెకు పుట్టుకతో వచ్చే అడ్రినల్ హైపర్‌ప్లాసియా అనే జన్యుపరమైన రుగ్మత ఉందని నివేదిక వెల్లడించింది. దీని కారణంగా ఆమె బాహ్య లైంగిక అవయవాలు మగపిల్లవాడిలా కనిపిస్తున్నాయి. పరిస్థితిని సరిచేయడానికి ఆమెకు శస్త్రచికిత్స చేయాలని కూడా సూచించారు.
ఆ తర్వాత ఆ వ్యక్తి తన భార్యను ఆమె తల్లిదండ్రుల వద్దకు తిరిగి పంపించి, తాను మోసపోయానని పేర్కొన్నాడు. ఈ విషయం తనకు తెలియకుండా పెళ్లి చేశారంటూ భార్య బంధువులతో భర్త గొడవకు దిగాడు. రెండు కుటుంబాల మధ్య అనేక గొడవలు జరిగాయి. ఇరువురు పోలీసు కేసులు పెట్టుకున్నారు. ఆ వ్యక్తి ఐపిసి సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు పెట్టాడు. ఆమె వైద్య పరిస్థితి గురించి అతనికి తెలియజేయడంలో విఫలమై భార్య, అత్తమామలు మోసం చేశారని ఆరోపించాడు.
ఆ తర్వాత ట్రయల్ కోర్టు ముందు తన వాంగ్మూలంలో.. డాక్టర్ కూడా ఆమెకు "ఆడ అవయవాలతో బాహ్య పురుష జననేంద్రియాలు" ఉన్నందున, ఆమె పరిస్థితి కారణంగా పిల్లలను కనడం సాధ్యం కాదని చెప్పారు. విచారణ కొనసాగుతున్న సమయంలో, ట్రయల్ కోర్టు మహిళకు నోటీసు జారీ చేసింది. అయితే ఆమె కోర్టు తప్పనిసరి వైద్య పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించింది. కేసును పరిగణలోకి తీసుకుని ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె మధ్యప్రదేశ్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. వైద్య నివేదికల ప్రకారం.. ఆమెకు తగిన స్త్రీ లక్షణాలు, అవయవాలు ఉన్నాయని, అందువల్ల మోసం జరగలేదంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు భర్త చేసిన అభియోగాలను కొట్టివేసింది.
భర్త సుప్రీం కోర్టు తలుపులు తట్టాడు
భార్య ఆరోగ్య పరిస్థితి గురించి తనకు తెలియజేయకపోవడంతో కుటుంబసభ్యులు మోసానికి పాల్పడ్డారనే వాదనతో భర్త ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పెళ్లి ఖర్చులన్నీ తానే భరించానని, దానికి భార్య కుటుంబం ఆర్థికంగా సహకరించలేదని కూడా పేర్కొన్నాడు. శుక్రవారం న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం ముందు జరిగిన క్లుప్త విచారణ సందర్భంగా, అప్పీలుదారు తరఫు సీనియర్ న్యాయవాది ఎన్‌కె మోడి వాదిస్తూ.. "మోసం" నేరం స్పష్టంగా ఉందని వాదించారు. ప్రస్తుతం భార్య, మామలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి ఏప్రిల్‌లో ఈ అంశాన్ని విచారించనుంది.