గత నెలలో శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో రేగిన కలకలం.. ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకున్న తర్వాత మాత్రమే సద్దుమణిగింది. అయితే.. ఆ కారణంగానే పార్టీలో అంతర్గత ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్సీపీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. శరద్ పవార్ ఎన్సీపీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ లకు ఆ బాధ్యతలను అప్పజెప్పింది. ఎన్సీపీ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పవార్ ఈ ప్రకటన చేశారు.
అయితే.. శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్‌కు ఎన్‌సిపిలోనే ముఖ్యమైన పదవైన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వకపోవడం అనేక రాజకీయ సంకేతాలను సూచిస్తుంది. అయితే ప్రకటన సమయంలో అజిత్ పవార్ వేదికపై ఉండటం విశేషం. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్, గోవా రాష్ట్రాలతో పాటు రాజ్యసభ బాధ్యతలను ప్రఫుల్ పటేల్‌కు పవార్ అప్పగించారు. మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, యూపీ లతోపాటు లోక్‌సభ బాధ్యతలను సుప్రియా సూలేకు అప్పగించారు. 2024 లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ మార్పులు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.