ఎయిర్ ఇండియా విమానంలో ఓ మహిళను తేలు కుట్టడంతో ఆమె ఆసుపత్రి పాలైంది. నాగ్‌పూర్-ముంబై విమానంలో ఒక మహిళా ప్రయాణికురాలిని తేలు కుట్టిన ఘటనపై ఎయిర్ ఇండియా శనివారం క్షమాపణలు చెప్పింది. ప్రస్తుతం ఆ మహిళ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన ఏప్రిల్ 23న ఎయిర్ ఇండియా నాగ్‌పూర్-ముంబై ఫ్లైట్ AI 630లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఎయిర్‌లైన్స్, బాధిత మహిళకు ఎయిర్ పోర్టులో ప్రథమ చికిత్స ఇప్పించామని.. ఆ తర్వాత ఆమెకు ఆసుపత్రిలో కూడా చికిత్స అందించామని తెలిపింది.
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అయిన తర్వాత, విమానాన్ని తనిఖీ చేసి, తేలును కనుగొన్నామని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. ఎయిర్ ఇండియా తన ప్రకటనలో, “ఏప్రిల్ 23, 2023న మా ఫ్లైట్ AI 630లో ప్రయాణీకులను తేలు కొరికిన దురదృష్టకర సంఘటన జరిగింది. ల్యాండింగ్ తర్వాత విమానాశ్రయంలో ఆమెను డాక్టర్ పరిశీలించారు. తరువాత ఆసుపత్రిలో చేర్పించాం. చికిత్స తీసుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యారు." అని ఉంది. మా బృందం ప్రోటోకాల్‌ను అనుసరించింది. విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసింది. ప్రయాణీకులకు కలిగిన బాధ మరియు అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా ప్రకటనలో పేర్కొంది.