కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గతకొన్ని రోజులుగా తగ్గిన కేసులు.. మళ్ళీ పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.
ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే హెచ్చరికలు కూడా చేశారు. మహారాష్ట్రలోని అమరావతి, యావత్మల్ జిల్లాల్లో లాక్ డౌన్ విధించగా.. పూణేలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. తాజాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో నాగపూర్ లో మార్చి 7వ తేదీ వరకు స్కూళ్ళు, కాలేజీలను మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇదిలావుంటే.. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే మంగళవారం సాయంత్రం బృహత్ ముంబై అధికారులతో సమావేశం కాబోతున్నారు. ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులపై సమీక్షించనున్నారు.
ఇదిలావుంటే.. ఇండియాలో కొత్తగా 14,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.10 కోట్లకు చేరింది. కొత్తగా 83 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1.56 లక్షలు దాటింది. మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. కొత్తగా 9695 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు.