కొత్త ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అరవింద్ కేజ్రీవాల్‌కు దిగువ కోర్టు జూన్ 20న బెయిల్ మంజూరు చేయగా.. హైకోర్టు శుక్రవారం మధ్యంతర స్టే విధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది.
హైకోర్టు శుక్రవారం స్టే ఇవ్వకపోయివుంటే.. కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి బయటకు వచ్చేవారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఇంప్లీడ్ ఆర్డర్ అమలును వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. జూన్ 24లోగా లిఖిత పూర్వకంగా నివేదిక ఇవ్వాలని ఇరు పక్షాలను హైకోర్టు ఆదేశించింది. ఈడీ కేసు రికార్డులను పరిశీలించాలని కోరుతున్నందున ఉత్తర్వులను రెండు మూడు రోజులకు రిజర్వ్ చేసినట్లు తెలుస్తుంది.
కింది కోర్టు జూన్ 20న బెయిల్ మంజూరు చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈడీ వేసిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు జూలై 10వ తేదీకి వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్‌లో ప్రాథమికంగా కేజ్రీవాల్ నేరం ఇంకా నిర్ధారించలేదని.. మనీలాండరింగ్ కేసులో అక్రమ ఆదాయానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్ష్యాలను సమర్పించడంలో ED విఫలమైందని పేర్కొంది.
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను కపటవాదులని అభివర్ణించారు. ఆప్ నాయకులు ఈడీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని.. ఈడీ ఎటువంటి ఆదేశాలు లేకుండా హైకోర్టును ఆశ్రయించిందని.. ఆప్ నేత కేజ్రీవాల్ కూడా ఇదే బాటలో పయనిస్తూ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు.