గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. బ్రహ్మోత్సవాల సమయంలో రద్దీ తక్కువగానే ఉన్నప్పటికీ.. గురువారం నుంచి అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు ప్రారంభం కావడంతో పాటు తమిళుల పెరటాసి మాసం మూడో శనివారం, పండుగ సెలవులు ముగుస్తున్న క్రమంలో తమిళనాడు నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకుంటున్నారు. ఫలితంగా భక్తులతో తిరుమల కిటకిట లాడుతోంది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్‌లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లు గోగర్భం డ్యామ్ వద్దకు చేరుకున్నాయి. దాదాపు 6 కిలోమీటర్ల వరకు భక్తులు బారులు తీరారు. రద్దీ భారీగా పెరగడంతో వసతి గదులు సరిపోక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్లలోని భక్తులకు దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తులు సంయమనం పాటించి దర్శనానికి వేచి ఉండాలని విజ్ఞప్తి చేశారు. క్యూలైన్లలోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్న పానీయాలు, తాగు నీరు, పాలు అందిస్తున్నట్లు తెలిపారు.
తిరుమలలోని అన్నప్రసాద భవనం, లడ్డూ వితరణ కేంద్రం, అఖిలాండం, బస్టాండ్, గదుల కేటాయింపు కేంద్రాలు, తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిన్న స్వామివారిని 70,007 మంది భక్తులు దర్శించుకోగా 42,866 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.25 కోట్లు వచ్చింది.