ఆ గదిలోకి ప్రవేశించి కోటి రూపాయలు డిమాండ్ చేశాడు.. ఆ తర్వాత కత్తితో..
ముంబైలోని బాంద్రాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి బుధవారం అర్థరాత్రి ఓ వ్యక్తి ప్రవేశించి నటుడిపై దాడికి పాల్పడ్డాడు.
By Medi Samrat Published on 16 Jan 2025 9:41 PM ISTముంబైలోని బాంద్రాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి బుధవారం అర్థరాత్రి ఓ వ్యక్తి ప్రవేశించి నటుడిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో సైఫ్‌తో పాటు అతని కొడుకు కూడా గాయపడ్డారు. బాంద్రా పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. ఈ సంఘటన తెల్లవారుజామున 2.30 గంటలకు జరిగింది. ఆ సమయంలో సైఫ్ కుటుంబం, సిబ్బంది నిద్రిస్తున్నారు. సైఫ్ ఇంట్లో సిబ్బందిగా పనిచేసే 56 ఏళ్ల నర్సు ఇల్యామా ఫిలిప్ పోలీసులకు సంఘటన వివరాలను తెలియజేస్తూ.. దాడి చేసిన వ్యక్తి యువకుడని.. అతని వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని.. సన్నగా ఉన్నాడని పేర్కొంది.
ఎఫ్ఐఆర్ ప్రకారం.. దాడి చేసిన వ్యక్తి సైఫ్ నాలుగేళ్ల కుమారుడు జెహ్ గదిలోకి ప్రవేశించి.. మొదట నర్సును బెదిరించి కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. నర్సు నిరసన వ్యక్తం చేయడంతో.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె చేయి, మణికట్టుకు గాయాలయ్యాయి.
ఈ గొడవ శబ్దం విన్న సైఫ్ కొడుకు, అమ్మమ్మ జును నిద్రలేచి గట్టిగా కేకలు వేశారు. దీంతో సైఫ్ అలీఖాన్, ఆయన భార్య కరీనాకపూర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సైఫ్ తన కుటుంబాన్ని రక్షించడానికి దొంగను ఎదురించి పోరాడి.. అందులో అతను గాయపడ్డాడు.
సైఫ్ మెడ, భుజాలు, వీపు, మణికట్టుపై గాయాలయ్యాయి. సైఫ్ ఇంట్లో పనిచేసే మరో మహిళ గీత జోక్యం చేసుకునే క్రమంలో గాయపడింది. అదనపు సిబ్బంది వచ్చేలోపే ఆగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయమై పోలీసులు విచారణ ప్రారంభించారు.
పోలీసులు ఈ ఘటనను దోపిడీ కేసుగా పరిగణిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడి ఎత్తు ఐదు అడుగుల ఐదు అంగుళాలు. ఈ ఘటనలో అతడు ముదురు రంగు దుస్తులు, టోపీ ధరించి ఉన్నాడు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్‌తో సహా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.