సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసు నిందితుడి అరెస్ట్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గురువారం అర్థరాత్రి 2 గంటలకు ఓ దుండ‌గుడు దాడి చేసిన విష‌యం తెలిసిందే.

By Medi Samrat  Published on  18 Jan 2025 8:33 PM IST
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసు నిందితుడి అరెస్ట్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై గురువారం అర్థరాత్రి 2 గంటలకు ఓ దుండ‌గుడు దాడి చేసిన విష‌యం తెలిసిందే. నిందితుడు దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దాడి చేసిన వ్యక్తి కోటి రూపాయలు అడిగాడని సైఫ్ పనిమనిషి పోలీసులకు తెలిపింది. ఈ విషయంలో ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. సైఫ్ అలీఖాన్‌ ప్రమాదం నుండి బయటపడ్డాడు.

సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి అందరినీ కలిచివేసింది. పోలీసుల చేతుల్లో సీసీటీవీ ఫుటేజీ ఉంది. అందులో నిందితుడు భవనం నుంచి పారిపోతున్న దృశ్యాలను చూడవచ్చు. ఈ కేసులో ముంబై పోలీసులు గుర్తు తెలియని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షాలిమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీ నుంచి ఆర్పీఎఫ్ ఓ యువకుడిని అదుపులోకి తీసుకుంది. ఆర్‌పిఎఫ్ ఇన్‌ఛార్జ్ సంజీవ్ సిన్హా మాట్లాడుతూ.. ముంబై పోలీసులు దుర్గ్ ఆర్‌పిఎఫ్‌కి ఫోటో పంపారని.. దాని ఆధారంగా అనుమానాస్పద యువకుడిని షాలిమార్ జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీ నుండి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

విచారణలో ఆ యువకుడి పేరు ఆకాష్ కైలాష్ కనోజియా అని.. అతడు ముంబై నివాసి అని తేలింది. అతను జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో బిలాస్‌పూర్‌కు వెళ్తున్నాడు.. అక్కడి నుండి యువకుడు టిల్డా నెవ్రాలోని తన పరిచయస్తుల ఇంటికి వెళ్లాలనుకున్న‌ట్లు ఆర్‌పిఎఫ్‌కి చెప్పాడు. అనుమానాస్పద యువకుడి ఫోటోను ముంబై పోలీసులు పంపించారు, దాని ఆధారంగా యువకుడు దాడి చేసిన వ్యక్తిగా గుర్తించారు.

అయితే ఆర్పీఎఫ్ పోలీసులు ఆ యువకుడిని ఇంకా విచారించలేదు. ముంబై పోలీసులు వచ్చిన తర్వాత విచారిస్తామని.. ఆ తర్వాత సమాచారం వెల్లడిస్తామని ఆర్పీఎఫ్ చెబుతోంది. ముంబై పోలీసులు 8 గంటలకు రాయ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దుర్గ్‌కు వస్తారు. విచారణ తర్వాత.. ముంబై పోలీసులు అత‌డిని తమతో తీసుకెళ్లనున్నారు.

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మాట్లాడుతూ, "నటుడు సైఫ్ అలీఖాన్‌పై కొద్ది రోజుల క్రితం దాడి జరిగింది.. నిందితుడిని దుర్గ్ నుండి RPF పట్టుకుంది.. ముంబై పోలీసులు వస్తున్నారు.. నిందితుడిని వారికి అప్పగిస్తారని వెల్ల‌డించారు.

ఇదిలావుంటే.. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని ఆసుపత్రి వైద్యులు శనివారం తెలిపారు. ఐసీయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత సాధారణ ఆహారం తీసుకోవడం ప్రారంభించాడు. సైఫ్ పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని, అయితే అతని పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.

Next Story