ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇటీవల బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. సద్గురు మెదడులో రక్తస్రావం, వాపు కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. మెదడు నుంచి గడ్డకట్టిన రక్తాన్ని తొలగించేందుకు మార్చి 17న ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం సద్గురు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. దీంతో న్యూ ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ నుండి ఆయన డిశ్చార్జ్ అయ్యారు.
సద్గురు తన ఆరోగ్య విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో పంచుకున్నారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసుపత్రి గది లోపల బెడ్‌పై కూర్చుని వార్తాపత్రిక చదువుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతకుముందు PM నరేంద్ర మోదీ కూడా సద్గురుతో మాట్లాడి.. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సద్గురు ప్రధానమంత్రికి తన కృతజ్ఞతలు తెలిపారు.