శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు నేటి నుండి తెరుచుకోనున్నాయి. గురువారం నుండి రెండు నెలల పాటు భక్తులకు దర్శనం కల్పించనున్నారు. వార్షిక మండలం-మకరవిలుక్కు యాత్ర కూడా రేపటి నుంచే ప్రారంభం కానుంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు (తంత్రి) కందరారు రాజీవ, మాజీ ప్రధాన అర్చకులు ఎన్. పరమేశ్వరన్ నంబూద్రి సమక్షంలో ఆలయ గర్భగుడి తలుపులు తెరుస్తారు. అనంతరం అయ్యప్ప, మలికాపురం ఆలయాల ప్రధాన అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 41 రోజుల పాటు జరిగే మండల పూజ కార్యక్రమాలు డిసెంబర్ 27న ముగియనున్నాయి. మూడు రోజుల పాటు ఆలయంలో దర్శనానికి అనుమతి ఉండదు. డిసెంబర్ 30వ తేదీ నుంచి మకరవిలుక్కు యాత్ర కోసం ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతి దర్శనం ఉంటుంది. ఇతర పూజా కార్యక్రమాల అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు.