నవంబర్ 15వ తేదీన శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. రెండు నెలల పాటు అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. మండల మకరవిళక్కు పండుగ నేపథ్యంలో వచ్చే సోమవారం ఆలయం తెరుచుకుంటుందని ఆలయ అధికారులు తెలిపారు. రోజుకు 30 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు గర్భగుడిని అర్చకులు తెరుస్తారు. ఆ తర్వాత మంగళవారం (16వ తేదీ) నుండి భక్తులను ఆలయంలోనికి అనుమతి ఇస్తారు.
వచ్చే నెల 26వ తేదీన మండల పూజ ముగుస్తుంది. మళ్లీ డిసెంబర్ 30 తేదీన మకరవిళక్కు కోసం ఆలయాన్ని తెరుస్తారు. 2022, జనవరి 14న శబరిమల కొండలపై మకరజ్యోతి దర్శనం ఇస్తుందని అధికారులు చెప్పారు. ఇక జనవరి 20వ తేదీన ఆలయ తలుపులు మూసివేస్తారు. కరోనా మహమ్మారి విజృంభించకుండా ఉండేందుకు కఠినంగా నిబంధనలు అమలు చేస్తామని తెలిపారు. శబరిమలకు వచ్చే వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు తెచ్చుకోవాల్సి ఉంటుంది.