మకరవిళక్కు పర్వదినం కోసం శబరిమలలోని అయ్యప్ప ఆలయం సోమవారం తిరిగి తెరచుకుంది. ప్రధాన అర్చకుడు ఎస్.అరుణ్ కుమార్, నంబూతిరి తంత్రి కందరారు రాజీవరుతో కలిసి సాయంత్రం 4 గంటలకు గర్భగుడిని తెరిచారు. దీని తర్వాత మలికప్పురం దేవి ఆలయాన్ని తిరిగి తెరిచారు. మండల పూజలు ముగియడంతో డిసెంబర్ 26న శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మూసివేశారు. ఇప్పుడు మకర విళక్కు సీజన్ కోసం ఆలయం మళ్లీ తెరచుకుంది.
డిసెంబరు 31 తెల్లవారుజామున ప్రత్యేక పూజలు మొదలవుతాయి. వేకువజామున 3 గంటలకు మకర విళక్కు సీజన్‌లో తొలిపూజ అనంతరం నెయ్యాభిషేకం నిర్వహిస్తారు. మకర విళక్కు సీజన్ ముగిసే వరకూ తెల్లవారుజామున 3.30 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకూ ప్రతి రోజూ స్వామికి నెయ్యాభిషేకం ఉంటుంది. మధ్యాహ్నం కలభ అభిషేకం నిర్వహిస్తారు. జనవరి 14న మకరజ్యోతి దర్శనమిస్తుంది. మకర జ్యోతిని దర్శించుకోడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు.