రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అనుబంధ మ్యాగజైన్ పాంచజన్యలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ను 'ఈస్ట్ ఇండియా కంపెనీ 2.0'లా తయారైందంటూ కవర్ స్టోరీని ప్రచురించారు. 18వ శతాబ్దంలో భారత్‌ను ఆక్రమించుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన పనులనే ఇప్పుడు అమెజాన్ కూడా చేస్తోందని ఆర్ఎస్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. ప్రభుత్వ విధానాలను కంపెనీకి అనుకూలంగా మార్చుకోవడానికి అమెజాన్ కోట్లాది రూపాయల ముడుపులు చెల్లించిందని సంచలన ఆరోపణలు చేసింది ఆర్ఎస్ఎస్ . భారత మార్కెటుపై ఏకఛత్రాధిపత్యం కోసం ప్రయత్నాల్లో భాగంగా అమెజాన్ మన పౌరుల వ్యక్తిగత, అర్థిక, రాజకీయ స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది.
అమెజాన్ యొక్క వీడియో ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియోపై కూడా తీవ్ర విమర్శలు చేసింది. భారతీయ సంస్కృతికి విరుద్ధంగా సినిమాలు మరియు టెలివిజన్ సిరీస్‌లను అమెజాన్ విడుదల చేస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ ఆరోపిస్తోంది. అమెజాన్ అనేక ప్రాక్సీ సంస్థలను స్థాపించిందని తనకు అనుకూలంగా ఉన్న పాలసీల కోసం కోట్ల లంచాలను పంపిణీ చేసినట్లు నివేదికలు ఉన్నాయని కూడా ఆరోపించింది. గత మూడేళ్లలో అమెజాన్ రూ.8500 కోట్ల మేర లీగల్ ఖర్చులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో అమెజాన్ ప్రమేయంపై ప్రత్యేకించి పూర్తిస్థాయిలో విచారణ జరుగనున్నట్టు కేంద్రం గతవారమే పేర్కొంది.