ప్రధాన మంత్రి మాతృ వందన యోజన కింద లబ్దిదారులైన మహిళలకు ( పాలిచ్చే తల్లులు ) రెండో ఆడబిడ్డ పుట్టినప్పుడు రూ.6000 ఒకేసారి ఆర్థిక సహాయం అందజేస్తామని పంజాబ్ మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ బల్జీత్ కౌర్ తెలిపారు. ఈ పథకం కింద గర్భిణులు, పాలిచ్చే తల్లులకు మొదటి బిడ్డ పుట్టినప్పుడు రూ.5000 ఆర్థిక సహాయం అందజేస్తారు. రెండో ఆడబిడ్డ పుట్టిన తర్వాత రూ.6000 ఆర్థిక సహాయం అందించడం ద్వారా తగ్గుతున్న ఆడపిల్లల లింగ నిష్పత్తిని మెరుగుపరుస్తామన్నారు.
దీని ద్వారా పుట్టుకకు ముందు లింగ నిర్థారణను ఆపడంలో కూడా సహాయపడుతుందన్నారు. ఈ పథకం పాలిచ్చే తల్లుల ఆరోగ్యాన్ని.. పిల్లల పోషకాహార శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడుతుందన్నారు. ఈ పథకం కింద రూ. 6000 నేరుగా లబ్ధిదారుల బ్యాంక్/పోస్టాఫీసు ఖాతాకు బదిలీ చేయబడుతుందని మంత్రి తెలిపారు.
ఈ ప్రయోజనాన్ని పొందడానికి, పంజాబ్‌లోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలలో అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా ఫారమ్‌లు నింపవచ్చని తెలిపారు. ఈ ప్రయోజనాన్ని పొందడానికి, ప్రతి లబ్ధిదారు తప్పనిసరిగా ఆధార్ కార్డును కలిగి ఉండాలి. ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో అనుసంధానించాలి. లబ్ధిదారులు ఆన్‌లైన్ పోర్టల్ https://pmmvy.nic.inలో ఇంట్లో కూర్చొని నమోదు చేసుకోవడం ద్వారా తమ దరఖాస్తును సమర్పించవచ్చని పేర్కొన్నారు.