సైబర్ మోసగాళ్ల నుంచి రూ.5489 కోట్లు రికవరీ : కేంద్ర హోంశాఖ
సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
By Knakam Karthik
సైబర్ మోసగాళ్ల నుంచి ఇప్పటివరకు రూ.5489 కోట్లు రికవరీ: కేంద్ర హోంశాఖ
సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఆ సొమ్మును బాధితులకు రీఫండ్ చేసేలా నిబంధనలను సులభతరం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన కేసుల్లో సైబర్ కమాండోల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ లోని తన కార్యాలయంలో సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ (CIS) కార్యకలాపాలను కేంద్ర మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ప్రాధాన్యతను వివరించారు. సైబర్ నేరాలపై పోరాటంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కల్పించే ప్రధాన కేంద్రంగా ఐ4సీ పనిచేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ మోసాల నియంత్రణలో భాగంగా తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రికి సంబంధిత శాఖ అధికారులు వివరించారు. సైబర్ మోసాల బాధితుల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు తెలిపారు. దీంతోపాటు 12 లక్షలకుపైగా సిమ్‌లు/మొబైల్ హ్యాండ్‌సెట్లను బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు. అట్లాగే రూ.4631 కోట్లు విలువైన మోసపూరిత లావాదేవీలను అడ్డోవడం జరిగిందని, అందులో భాగంగా 13.3 లక్షల మ్యూల్ అకౌంట్లను (సైబర్ మోసాల్లో డబ్బు తరలించడానికి వాడే బ్యాంకు ఖాతాలు) ఫ్రీజ్ చేసినట్లు వివరించారు.
అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ జీ-20 సదస్సు, శ్రీ రామ మందిర్ ప్రారంభం, మహాకుంభ్, ఆపరేషన్ సిందూర్ వంటి జాతీయ ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాల సమయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసి సైబర్ దాడులను విజయవంతంగా ఎదుర్కోవడంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. సైబర్ మోసాల బాధితులకు తిరిగి చెల్లించాల్సిన డబ్బు రీఫండ్ ప్రక్రియను సులభతరం చేయాలని, లా ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలకు (LEAs) ఆధునిక పరికరాలు, శిక్షణతో దర్యాప్తు సంస్థల సామర్థ్యాన్ని మరింతగా పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు, చిన్నారులు లక్ష్యంగా సాగే ఆన్‌లైన్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి గుర్తింపు, రిపోర్టింగ్, బాధితుల సహాయ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.అత్యవసర కేసుల కోసం సైబర్ కమాండోలు సరైన రీతిలో నియమించాలి.సైబర్ మోసాలపై అవగాహన పెంచేందుకు, హెల్ప్‌లైన్ 1930 మరియు cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయడానికి ఉత్సాహపరిచే విధంగా స్థానిక భాషల్లో ప్రజా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు.