ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో పేలిన సిలిండర్.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి

ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో వల్సాద్ ఎక్స్‌ప్రెస్ బోగీలో జరిగిన పేలుడులో ఆర్పీఎఫ్ జవాన్ మరణించాడు. బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి

By Medi Samrat  Published on  22 April 2024 1:30 PM IST
ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో పేలిన సిలిండర్.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి

ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌లో వల్సాద్ ఎక్స్‌ప్రెస్ బోగీలో జరిగిన పేలుడులో ఆర్పీఎఫ్ జవాన్ మరణించాడు. బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగ‌డంతో ఆర్పీపీఎఫ్ బృందం మంటలను అదుపు చేయడం ప్రారంభించింది. ఆ బృందంలో కానిస్టేబుల్ వినోద్ కుమార్ కూడా ఫైర్ సిలిండర్ (అగ్నిమాపక యంత్రం)తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. ఇంతలో అగ్నిమాపక సిలిండర్‌ పేలింది. రైల్వే అధికారులు వినోద్‌కుమార్‌ను వెంట‌నే ఆసుపత్రికి త‌ర‌లించారు. అయితే వైద్యులు అప్ప‌టికే అతను చనిపోయినట్లు ప్రకటించారు.

వల్సాద్ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 6.30 గంటలకు ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. కొద్దిసేపటికి రైలులోని ఎస్‌-8 బోగీలోని టాయిలెట్‌లో మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే, ఆర్పీఎఫ్‌ బృందాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయడం ప్రారంభించాయి. ఆర్పీఎఫ్ జవాన్ వినోద్ కుమార్ కూడా వచ్చి అగ్నిమాపక సిలిండర్‌తో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాడు. ఒక అగ్నిమాపక సిలిండర్ అయిపోయినా మంటలు తగ్గలేదు. ఇంతలో మరో ఫైర్ సిలిండర్ తో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించాడు. సిలిండర్ తాళం తెరవగానే సిలిండర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో వినోద్ కుమార్ మృతి చెందిన‌ట్లుగా అధికారులు తెలిపారు. వినోద్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఆర్పీఎఫ్ టీమ్ అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. వినోద్ కుమార్ మ‌ర‌ణంతో అత‌ని కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అల‌ముకున్నాయి.

Next Story