మహిళలకు ఏటా రూ.30 వేలు, తేజస్వీయాదవ్ సంచలన ప్రకటన
తొలి విడత పోలింగ్‌కు 2 రోజుల ముందు బిహార్‌లోని విపక్ష 'మహా గఠ్బంధన్' కూటమి సీఎం అభ్యర్థి, ఆర్‌జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు
By - Knakam Karthik |
మహిళలకు ఏటా రూ.30 వేలు, తేజస్వీయాదవ్ సంచలన ప్రకటన
తొలి విడత పోలింగ్‌కు 2 రోజుల ముందు బిహార్‌లోని విపక్ష 'మహా గఠ్బంధన్' కూటమి సీఎం అభ్యర్థి, ఆర్‌జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతీ మహిళకు ఏటా రూ.30వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని వెల్లడించారు. వచ్చే సంవత్సరం మకర సంక్రాంతి రోజున (జనవరి 14న) 'మై బహిన్ యోజన' ద్వారా మహిళలకు రూ.30వేలను అందిస్తామని తెలిపారు. మంగళవారం పట్నాలో విలేకరుల సమావేశంలో తేజస్వి యాదవ్ ఈ వివరాలను చెప్పారు.
మరోవైపు 'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన' ద్వారా సొంత వ్యాపారాలు చేసుకునేందుకు కోటి మందికిపైగా మహిళలకు రూ.10వేల ఆర్థికసాయం చేస్తామని ఎన్‌డీఏ కూటమి హామీ ఇచ్చింది. దీనికి కౌంటర్‌గానే మహిళలకు ఏటా రూ.30వేల సాయాన్ని అందించే హామీని తేజస్వి ఇచ్చినట్లు తెలుస్తోంది.
"నేను చాలా ప్రాంతాల్లో పర్యటించి అక్కాచెల్లెళ్లతో మాట్లాడాను. మా పథకం పట్ల వారంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇది తమకు ఆర్థిక న్యాయం చేకూరుస్తుందని వారు భావిస్తున్నారు. అందుకే వారి డిమాండ్ మేరకు నెలనెలా కాకుండా ఒకేసారి ఈ మొత్తాన్ని అందించాలని నిర్ణయించాం" అని తేజస్వి పేర్కొన్నారు. వాస్తవానికి, గత వారం విడుదల చేసిన మేనిఫెస్టోలో నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని ఆర్జేడీ ప్రకటించింది.
ఇదే సమయంలో రైతులు, ఉద్యోగులకూ పలు హామీలు ఇచ్చారు. వరికి కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌కు రూ.300, గోధుమకు రూ.400 బోనస్ ఇస్తామన్నారు. ఉపాధ్యాయులు, పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వారి సొంత జిల్లాకు 70 కిలోమీటర్ల పరిధిలోనే బదిలీలు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) తిరిగి అమలు చేస్తామని కూడా తేజస్వి పునరుద్ఘాటించారు. బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు