బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్, భారత ప్రధాని నరేంద్ర మోదీలు త్వరలోనే భేటీ కాబోతున్నారు. ఇండొనేషియాలోని బాలిలో వచ్చే నెల జీ20 లీడర్ షిప్ సమ్మిట్ జరగబోతోంది. ఈ సమావేశాల్లో ఇరువురూ ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు అంగీకారం తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించి బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశాలైన భారత్, బ్రిటన్ లు ప్రపంచ ఆర్థికశక్తులుగా మరింత వికసించేందుకు ఇరు దేశాల అధినేతలు కలిసికట్టుగా పని చేయడానికి ఆకాంక్షిస్తూ ఉన్నారని ప్రకటనలో తెలిపింది. ఇండొనేషియాలో జరిగే సమ్మిట్ లో ఇరువురు ప్రధానులు చర్చలు జరుపుతారని పేర్కొంది.
రిషి సునాక్ కు భారత ప్రధాని మోదీ గురువారం రాత్రి ఫోన్ చేశారు. సునాక్ కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపిన మోదీ... రిషి సునాక్ తో మాట్లాడటం సంతోషంగా ఉందని తెలిపారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యంపై వీలయినంత త్వరగా ఓ అవగాహనకు రావాల్సి ఉందని సునాక్ కు మోదీ తెలిపారు. ఈ ప్రతిపాదనకు సునాక్ కూడా సానుకూలంగా స్పందించినట్లు మోదీ వెల్లడించారు. ఇరు దేశాలు కలిసి ఎదుర్కోవాల్సి ఉన్న సమస్యలు, అంశాలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చించారు.