ట్రాక్టర్ ర్యాలీ.. 153 మంది పోలీసులకు గాయాలు.. 22 ఎఫ్ఐఆర్‌లు.. నటుడు దీప్ సిద్దుపై బిగుస్తున్న ఉచ్చు
Rioting farmers injure 153 cops 22 firs lodged.నిన్న దేశ రాజధానిలో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో 153 మంది పోలీసులకు గాయాలు.. 22 ఎఫ్ఐఆర్‌లు.
By తోట వంశీ కుమార్ Published on 27 Jan 2021 5:29 AM GMTనిన్న దేశ రాజధానిలో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో 150 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు తీవ్ర గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పబ్లిక్ ప్రాపర్టీ కూడా ధ్వంసమైంది. దీంతో ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు 22 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ప్రత్యేక విచారణ బృందాన్ని(సిట్)ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. 72వ గణతంత్ర దినోత్సవం రోజున పంజాబీ, హర్యానా రైతులు.. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ట్రాక్టర్లతో ర్యాలీ తీసిన విషయం తెలిసిందే.
పోలీసులంతా రిపబ్లిక్ డే పై దృష్టిసారించగా.. అన్నదాతలు తమ మార్గం మళ్లించి చార్రితక ఎర్రకోట వైపు పయనమయ్యారు. అడ్డుపెట్టిన కంటెయినర్లు, బస్సులను తమ ట్రాక్టర్లతో పక్కకు నెట్టి ఎర్రకోట చేరుకున్నారు. ఎర్రకోటపై ఏకంగా జెండాలను పాతారు. అయితే ఈ ఘటనలో ఎంత మంది రైతులు గాయపడ్డారో ఇంకా స్పష్టంగా తెలియదు. రైతుల ట్రాక్టర్ల ర్యాలీతో భారీ నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. వందల కోట్లలో ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ముందస్తు కుదుర్చుకున్న ఒప్పందాలను రైతులు ఉల్లంఘించినట్లు ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. హింసకు దిగిన రైతులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎర్రకోటతో పాటు ప్రధాన ప్రాంతాల్లో భారీగా పోలీసులు మొహరించారు. ఉద్రికత్తల నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. రైతులు ఉద్యమం సాగిస్తున్న సింఘు, టిక్రి, ఘాజీపూర్, ముకర్బా, చౌక్, నంగ్లోయి తదితర ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నాం నుంచే ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
నిన్న న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన ఘటనల వెనుక నటుడు, గాయకుడు దీప్ సిద్ధూ ఉన్నాడని.. ఆయనే ట్రాక్టర్ ర్యాలీని ఎర్రకోట వైపు మళ్లించాడని ఆరోపిస్తున్న రైతు నిరసనకారులు.. ఆయన్ను ఇండస్ సరిహద్దు నుంచి తరిమికొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ర్యాలీలో జరిగిన హింసకు బాధ్యుడిగా భావిస్తున్న ఆయనపై ఉచ్చు బిగుస్తోంది. ర్యాలీ ముందు రోజు రైతుల స్టేజీపై దీప్ సిద్దు ప్రసంగించారు. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి అర్థరాత్రి వరకు కూడా రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిర్ణయించిన రూట్‌లో ర్యాలీ వద్దని.. రింగు రోడ్డుపై ర్యాలీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా నేతలు నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే తామే నిర్ణయం తీసుకుంటామంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఎర్రకోట హింస జరిగిన ప్రాంతంలో కూడా దీప్ సిద్దు కనిపించారు.