ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వాహనంపై కాల్పులు జరిగిన ఘటనపై రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఓవైసీ కారుపై మూడు బుల్లెట్ గుర్తులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆ దాడి నుంచి ఓవైసీ సురక్షితంగా బయటపడ్డట్లు ఆయన చెప్పారు. హాపూర్‌లో జరగాల్సిన ఈవెంట్ గురించి ఓవైసీ ప్లాన్ చేయలేదని, ఆ విషయాన్ని జిల్లా అధికారులకు కూడా చెప్పలేదన్నారు. కాల్పుల కేసులో ఇప్పటికే ఇద్దర్ని అరెస్టు చేసినట్లు షా తెలిపారు. యూపీ ప్రభుత్వం నుంచి దీనిపై రిపోర్ట్‌ను కోరినట్లు మంత్రి చెప్పారు. ఓవైసీకి ఉన్న సెక్యూర్టీ లోపాన్ని అంచనా వేశామని, అందుకే ఆయనకు జెడ్ క్యాటగిరీ సెక్యూర్టీ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి అమిత్ షా తెలిపారు. తాము ఇచ్చిన సెక్యూర్టీ కవర్‌ను అంగీకరించాలని ఓవైసీని మంత్రి కోరారు. అసద్ కారుపై జరిగిన కాల్పుల ఘటనను ముగ్గురు వ్యక్తులు ప్రత్యక్షంగా చూసినట్లు మంత్రి చెప్పారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ ఘటన అనంతరం ఒవైసీకి జెడ్ సెక్యూరిటీ భద్రతను కల్పించామని, దీన్ని ఆయన తిరస్కరించారని అన్నారు. జెడ్ సెక్యూరిటీ భద్రతను ఒవైసీ తక్షణమే అంగీకరించాలని కోరుతున్నానని అమిత్ షా చెప్పారు. ఒవైసీ అంగీకరించిన వెంటనే ఢిల్లీ, తెలంగాణ పోలీసులు ఆయనకు భద్రత కల్పించడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఆయన నిరాకరించడం వల్ల ఢిల్లీ, తెలంగాణ పోలీసులు భద్రతను ఇవ్వలేకపోయాయని అమిత్ షా స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను పరిరక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలు చర్యలు తీసుకున్నాయని అన్నారు.